Read more!

English | Telugu

తెలుగు సినిమా స్టామినా ఏమిటో కలెక్షన్లపరంగా చూపిన మొదటి సినిమా ‘అడవి రాముడు’

డైరెక్టర్‌గా చేసింది రెండు సినిమాలు. ఆ రెండు సినిమాలూ కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. మరి మూడో సినిమాయే ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోతో చెయ్యాల్సి వస్తే ఆ దర్శకుడికి ఎలా ఉంటుంది? అప్పుడతని మానసిక స్థితి ఏమిటి? రెండు ఏవరేజ్‌ సినిమాలు చేసిన దర్శకుడిగా ఒక స్టార్‌ హీరోతో సినిమా చేసి సూపర్‌హిట్‌ చెయ్యాలంటే ఎంత గ్రౌండ్‌ వర్క్‌ చేసి ఉండాలి, ఎంతగా ఆలోచించి ఉండాలి. ఆ పరిస్థితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి వచ్చింది. ఆయన మూడో ప్రయత్నంగా చేసిన సినిమాయే ‘అడవి రాముడు’. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? ఎన్టీఆర్‌తో చేసిన మొదటి సినిమాని సూపర్‌హిట్‌ చేయడం కోసం ఏయే అంశాలపై ఆయన దృష్టి పెట్టారు? అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

‘నా మొదటి సినిమా ‘బాబు’. నేను డైరెక్టర్‌గా నా పేరు స్క్రీన్‌మీద చూసుకుంది ఆ సినిమాతోనే. అప్పటికి ఫామ్‌లో ఉన్న శోభన్‌బాబును హీరోగా పెట్టుకొని, వాణిశ్రీ, లక్ష్మీ, అరుణా ఇరాని హీరోయిన్లుగా చేసిన ‘బాబు’ చిత్రానికి అప్రిషియేషన్‌ వచ్చింది. మంచి సినిమా చేసావనే పేరు వచ్చింది. కానీ, కమర్షియల్‌గా ఏవరేజ్‌ అనిపించుకుంది. ఆ తర్వాత మురళీమోహన్‌, జయసుధ జంటగా రూపొందించిన సినిమా ‘జ్యోతి’. ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్‌ రావడమే కాదు, నంది అవార్డు కూడా లభించింది. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా కూడా ఏవరేజ్‌ అయ్యింది. ఈ రెండు సినిమాల అనుభవంతో మూడో సినిమాగా అవార్డు సినిమా చెయ్యాలా, కమర్షియల్‌ సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తుండగా, సత్యచిత్ర నిర్మాతలు నా దగ్గరకి వచ్చి ఎన్‌.టి.రామారావుగారితో మీరు ఓ సినిమా చెయ్యాలి అని అడిగారు. నేను షాక్‌ అయ్యాను. మొదట నేను నమ్మలేదు. ఆ తర్వాత ఈ విషయం రామారావుగారికి చెప్పారా అని అడిగాను. మీ పేరు చెప్పగానే ఆయన ఓకే అన్నారని చెప్పారు. దాంతో నాపై ఓ కొత్త బాధ్యత వచ్చి పడింది 

ఈ ఆఫర్‌ నాకు వచ్చే నాటికి రామారావుగారికి 54 ఏళ్ళు. ఆ వయసులో ఉన్న ఆయనతో స్టూడెంట్‌ సినిమా చెయ్యలేను, లవ్‌స్టోరీ చెయ్యలేను. మరి ఎలాంటి సినిమా అయితే బాగుంటుంది అని ఆలోచించాను. దేవుడికి ప్రతి రూపంగా ఉండే క్యారెక్టర్స్‌ ఎన్నో చేశారాయన. ఆయన స్క్రీన్‌మీద కనిపిస్తే హారతులు ఇచ్చేవారు. ఆయనకి అది చాలా ప్లస్‌. దాన్ని డబుల్‌ ప్లస్‌ చెయ్యాలి. దాన్ని ఒక కమర్షియల్‌ సినిమాలో చెయ్యాలనుకున్నాను. రామారావుగారు ఏనుగు మీద కూర్చొని వస్తుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. అలా చెయ్యాలంటే ఆ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ అయి ఉండాలి. ఆయనతో టార్జాన్‌లాంటి సినిమా చెయ్యలేము. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అయితే డిగ్నిఫైడ్‌గా ఉంటుందనిపించి ఆ దిశగా ఆలోచించాను. గెటప్‌ బాగుంటుంది అనిపించింది. ప్లస్‌ని, డబుల్‌ ప్లస్‌ చెయ్యగలిగాము. ఇక ఆయనలోని మైనస్‌ గురించి ఆలోచిస్తే డాన్సులు. అప్పటికి అక్కినేని నాగేశ్వరావుగారు తన స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. ఒక ఫారెస్ట్‌ ఆఫీసర్‌ హీరోయిన్‌తో డాన్సులు చేస్తే బాగోదు. అందుకని ఫస్ట్‌హాఫ్‌లో హీరోని ఒక సాధారణ వ్యక్తిగా పరిచయం చేసి సెకండాఫ్‌లో అతను ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అని రివీల్‌ చేస్తే.. ఫస్ట్‌హాఫ్‌లో కావాల్సిన రొమాన్స్‌, పాటలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా చెయ్యొచ్చు అనిపించింది. అలా ఆయనలోని మైనస్‌ని ఈ సినిమాలోని పాటలతో ప్లస్‌ చెయ్యగలిగాం. 

ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే... అప్పటికే రామారావుగారు ఎన్నో పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు ఇంకా అనేక మహానుభావుల పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్స్‌ని చూపిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే అప్పటివరకు ఆయన వేయని వాల్మీకి, ఏకలవ్యుడి పాత్రలను ఒక పాటలో చూపించాం. ఇక ఆ పాటలోనే రామారావుగారిని రాముడిలా చూపించడానికి ఒక కారణం ఉంది. ఆయన్ని రాముడిగా ప్రత్యక్షంగా చూడాలనుకున్నాను. అందుకే అంతకుముందు ఆయన చేసిన క్యారెక్టరే అయినా ఇందులో పెట్టాము. ఆయన్ని రాముడిగా ప్రత్యక్షంగా చూశాక నా జన్మ ధన్యమైంది అనిపించింది. అదే సినిమాకి లాస్ట్‌ షాట్‌ అవ్వాలనుకున్నాను. అలాగే లాస్ట్‌ షాట్‌ రాముడితోనే చేశాము. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే యూనిట్‌లోని అందరూ ఆయన పాదాలకు నమస్కారం చేశారు. ఆయన కూడా ఇది చూసి ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. 

ఇక ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్‌గా నాకు బంగారు బాట వేసిన సినిమా ‘అడవి రాముడు’. షూటింగ్‌ పూర్తయిన తర్వాత వెళుతూ వెళుతూ ‘నలభై రోజులు అడవిలో మీతో ప్రయాణం చేశాం బ్రదర్‌. ఇట్‌ ఈజ్‌ గ్రీన్‌ మెమరీ ఇన్‌ మై లైఫ్‌’ అన్నారు. ఆయన నాకిచ్చిన కాంప్లిమెంట్‌ ఆస్కార్‌ కంటే గొప్పదిగా ఫీల్‌ అవుతున్నాను. జన్మజన్మలకి ఆయన రుణం తీర్చుకోలేను. నా సక్సెస్‌కి, ఇప్పుడు నేనున్న పొజిషన్‌కి ముఖ్యంగా ఆయనే కారణం. ఒక స్టార్‌ హీరోతో సినిమా చెయ్యాలంటే ఇన్ని ఎలిమెంట్స్‌ గురించి ఆలోచిస్తేనే కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యే సినిమా చెయ్యగలం. ఆరోజుల్లో తెలుగు సినిమాకి ఇంత కలెక్షన్‌ వస్తుందా అని మొదటిసారి ప్రూవ్‌ చేసిన ‘అడవి రాముడు’ ఒక చరిత్ర సృష్టించింది. 4 సెంటర్స్‌లో 365 రోజులు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడడమే కాకుండా, నెల్లూరు కనకమహల్‌ థియేటర్‌లో ప్రతిరోజూ 5 ఆటలతో 100 రోజులు ఆడడం మరో విశేషం’ అంటూ వివరించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.