Read more!

English | Telugu

తను చెయ్యాల్సిన సినిమా అమల చేసిందని సీరియస్‌ అయిపోయిన మాధురీ దీక్షిత్‌!

భారతీయ సినిమా చరిత్రలో కొన్ని చెప్పుకోదగిన సినిమాల్లో ‘పుష్పక విమానము’ ఒకటి. కమల్‌హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి కారణం ఈ సినిమా మాటల్లేకుండా మూకీ సినిమాగా రూపొందడమే. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు పూయించేలా చేసిన సినిమా ఇది. 1987లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ కాకపోయినా యూనిట్‌లోని అందరికీ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకి కమల్‌హాసన్‌ నటన, ఎల్‌.వైద్యనాథన్‌ సంగీతం ప్రాణం అని చెబుతారు. 

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడమే కాదు, దర్శకత్వం వహిస్తూ నిర్మించారు సింగీతం శ్రీనివాసరావు. ఇందులో హీరోయిన్‌గా నటించే  అమ్మాయిని వెతకడం కోసం సింగీతం పెద్ద రిస్కే చేశారు. మొదట ఈ కథకు బాలీవుడ్‌ హీరోయిన్‌ నీలమ్‌ కొఠారి సరిపోతుందని భావించారు సింగీతం. ముంబాయి వెళ్లి కలిసి ఆమెను ఓకే చేశారు. అయితే ఆమె ఈ సినిమా చేసేందుకు కొన్ని షరతులు పెట్టింది. అవేమిటంటే తనతోపాటు ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీలమ్‌ చెప్పిందట. అయితే దానికి సింగీతం ‘ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. అందువల్ల మీరు అడిగిన ఫెసిలిటీస్‌ ఇవ్వలేం’ అని చెప్పారు. దాంతో నీలమ్‌ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అయితే అదే సమయంలో డైరెక్టర్‌ రమేష్‌ సిప్పీని కలిసి విషయం చెప్పారు సింగీతం. ‘ఒక అందమైన అమ్మాయి ఉంది. అయితే ఆ అమ్మాయి ఐరన్‌లెగ్‌ అనిపించుకుంటోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె నటించిన నాలుగైదు సినిమాలు సగంలోనే ఆగిపోయాయి. అలాంటి సెంటిమెంట్లు మీకు లేకపోతే ఒకసారి ఆమెను కలవండి. ఆమె పేరు మాధురీ దీక్షిత్‌’ అని చెప్పారు రమేష్‌ సిప్పీ. 

కొంచెం కష్టపడి మాధురీ దీక్షిత్‌ అడ్రస్‌ కనుక్కున్నారు సింగీతం. మొదట పిఎని కలిసి విషయం చెప్పారు. దానికా పీఏ ‘సినిమాలో డైలాగులే లేవు అని చెబుతున్నారు. మా హీరోయిన్‌ అలాంటి సినిమాలు చేయదు’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు తనకు జరుగుతున్న సన్మానానికి అమల వచ్చారు. ఆమె గురించి వివరాలు సేకరించారు సింగీతం. శివాజీ గణేశన్‌తో ఒక సినిమా చేసిందని, నటించడం అసలు రాదని చెప్పారు కొందరు. తనకు మాత్రం ఆమె ముఖం చూస్తే అలా అనిపించలేదట. చాలా నేచురల్‌గా అనిపించడంతో ‘పుష్పకవిమానము’ చిత్రంలో అమలనే తీసుకున్నారు. 

ఈ సినిమా తెలుగులో ‘పుష్పక విమానము’, హిందీలో ‘పుష్పక్‌’గా, అలాగే వివిధ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో మాటలు లేకపోవడంవల్ల అని ప్రాంతాలకు ఈ సినిమా వర్తించింది. ఆ తర్వాత మాధురీ దీక్షిత్‌కి ఈ సినిమా విషయం, తనని హీరోయిన్‌గా అడిగిన విషయం తెలిసింది. ‘మంచి ఛాన్స్‌ పోగొట్టావు’ అంటూ తన పీఏపై సీరియస్‌ అయిందట మాధురి.