Read more!

English | Telugu

ఏపీలో గ‌వర్న‌మెంట్ కంట్రోల్‌లో సినిమా.. టాలీవుడ్ పెద్ద‌లు ఇప్పుడేం చేస్తారు?

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. త‌మ‌తో స‌మావేశం సంద‌ర్భంగా టికెట్ ధ‌ర‌ల పెంపుపై సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించార‌ని చంక‌లు గుద్దుకున్న టాలీవుడ్ సినిమా పెద్ద‌ల ముఖంలో ఇప్పుడు క‌త్తివాటుకు నెత్తురుచుక్క లేదు. పెద్ద సినిమాలు విడుద‌లైన‌ప్పుడు టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌చ్చ‌ని ఆనంద‌ప‌డ్డ ప్రొడ్యూస‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్స్‌కు నిన్న అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఏపీ సినిమాస్ రెగ్యుల‌రైజేష‌న్ అమెండ్‌మెంట్ బిల్లు షాక్‌నిచ్చింది. టిక్కెట్ ధ‌రల పెంపు మాత్ర‌మే కాదు.. బెనిఫిట్ షోలు, ఎక్స్‌ట్రా షోలకు కూడా ఈ బిల్లు ప్ర‌కారం చెక్ పడింది. పైగా టికెట్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్‌లో అమ్ముతుంది కాబ‌ట్టి ఏపీలో సినిమా ఎగ్జిబిష‌న్ అనేది పూర్తిగా గ‌వ‌ర్న‌మెంట్ కంట్రోల్‌లో వెళ్లిపోయిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత బిగ్ బ‌డ్జెట్ సినిమాలేవీ విడుద‌ల కాలేదు కాబ‌ట్టి, ఇంత‌దాకా ఏదో విధంగా ఇండ‌స్ట్రీ నెట్టుకొచ్చింది. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ మూవీ 'అఖండ‌'తో థియేట‌ర్ల‌లో పెద్ద సినిమాల విడుద‌ల‌లు మొద‌ల‌వుతున్నాయి. డిసెంబ‌ర్ 2న 'అఖండ' రిలీజ‌వుతోంది. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సినీ గోయ‌ర్స్‌లో ఉన్న క్రేజ్ అసాధార‌ణం. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో పాటు, ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ 'అఖండ' మూవీకి విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చాయి. తెలంగాణ‌లో ఈ మూవీ బెనిఫిట్ షోల‌కు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఏపీలో ఇందుకు పూర్తి విరుద్ధ‌మైన వాతావ‌ర‌ణం ఉంది. అక్క‌డ బెనిఫిట్ షోల‌కు చాన్స్ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. పైగా ఇప్పుడున్న టికెట్ రేట్ల‌నే కొన‌సాగించాల్సిన ప‌రిస్థితి ఉండ‌టంతో క‌లెక్ష‌న్ల‌పై ఇది పెను ప్ర‌భావాన్ని చూపే ప్ర‌మాదం ఉంది. 

'అఖండ' త‌ర్వాత డిసెంబ‌ర్ 17న 'పుష్ప‌', జ‌న‌వ‌రి 7న 'ఆర్ఆర్ఆర్‌', జ‌న‌వ‌రి 12న 'భీమ్లా నాయ‌క్‌', జ‌న‌వ‌రి 14న 'రాధే శ్యామ్' లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌స్తున్నాయి. వీటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్స్ ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌లో మునిగిపోయారు. ఇప్పుడున్న టికెట్ ధ‌ర‌ల‌నే కొన‌సాగిస్తే, ఎక్స్‌ట్రా షోస్‌కు అనుమ‌తి లేక‌పోతే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని వారు భ‌య‌ప‌డుతున్నారు.

వెంకీ, బాల‌య్య‌, నాగ్, చిరు.. వ‌రుస నెలల్లో భ‌లే ఎంట‌ర్టైన్మెంట్!

ఒక‌వైపు నిత్యావ‌స‌ర వ‌స్తువుల నుంచి అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతుంటే, వాటిని కంట్రోల్ చేయ‌లేని ప్ర‌భుత్వం సినిమా టికెట్ ధ‌రల‌ను మాత్ర‌మే ఎందుకు కంట్రోల్‌లో పెట్టాల‌నుకుంటోంద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నిత్యావ‌స‌రాలు లేనిదే జ‌నం బ‌త‌క‌లేరు. కానీ వాటి ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వానికి నియంత్ర‌ణ ఉండ‌ట్లేదు. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నిత్యావ‌స‌రాలు కొన‌క త‌ప్పుదు. సినిమా విష‌యానికొస్తే అదేమీ నిత్యావ‌స‌రం కాదు. ఇష్ట‌మున్నవాళ్లే సినిమాకు వెళ్తారు. త‌మ తాహ‌తుకు త‌గ్గ టికెట్‌నే కొనుగోలు చేస్తారు. త‌మ తాహ‌తుకు మించిన రేట్లు వుంటే జ‌న‌మే సినిమాల‌కు వెళ్ల‌రు. అలాంట‌ప్పుడు సినిమా విడుద‌లైన స‌మ‌యంలో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ఎందుకు ప్ర‌భుత్వాలు అడ్డం ప‌డుతున్నాయ‌నేది డిస్ట్రిబ్యూట‌ర్ల, ఎగ్జిబిట‌ర్ల‌ ప్ర‌శ్న‌. 

ప‌రిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో థియేట‌ర్లు న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌ని ఎగ్జిబిట‌ర్లు వాపోతున్నారు. ఫ‌లితంగా వాటిని మూసుకోక త‌ప్ప‌ద‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. సినిమా విష‌యంలో తెలంగాణ‌లో లేని స‌మ‌స్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఎందుకుంటోంది? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌తోనే సినిమాపై కూడా ఏపీ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని అంటున్నారు.

'భీమ్లా నాయక్' రీషూట్.. 'ఆర్ఆర్ఆర్'కు రూట్ క్లియర్!