Read more!

English | Telugu

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. టాప్ 10 ఆల్ టైమ్ క్లాసిక్స్!

తెలుగునాట తిరుగులేని కథానాయకుడిగా రాణించిన వైనం.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సొంతం. ఎలాంటి పాత్రకైనా జీవం పోసి.. మహానటుడు అనిపించుకున్నారాయన. 70 ఏళ్ళ అభినయపర్వంలో ఆయన ధరించని పాత్ర లేదు. పొందని పురస్కారం లేదు. చూడని విజయం లేదు. అలాంటి ఏయన్నార్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచిన 10 మెమరబుల్ మూవీస్ ఏంటో చూద్దాం.. 

1. బాలరాజు: జానపద చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేశారు ఏయన్నార్. ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన ఈ చిత్రం.. తెలుగులో తొలి సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ కావడం విశేషం. అంతేకాదు.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గానూ రికార్డులకెక్కింది బాలరాజు.
2. దేవదాసు: ఏయన్నార్ కెరీర్ లో మరపురాని చిత్రం దేవదాసు. టైటిల్ రోల్ లో తన అద్భుతాభినయంతో మెప్పించారు. అభిమానగణాన్ని మరింతగా పెంచుకున్నారు. వేదాంతం రాఘవయ్య రూపొందించిన ఈ క్లాసిక్.. అక్కినేని నటజీవితంలో ఓ మేలిమలుపు.
3. మాయాబజార్: తెలుగువారికి అత్యంత ఇష్టమైన చిత్రాల్లో మాయాబజార్ ఒకటి. హేమాహేమీలు కలిసి నటించిన ఈ సినిమాలో అభిమన్యుడుగా భలేగా ఆకట్టుకున్నారు ఏయన్నార్. ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులు కూడా ముఖ్య పాత్రల్లో అలరించారు. 
4. సువర్ణ సుందరి: వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ జానపద చిత్రం.. అప్పట్లో అఖండ విజయం సాధించింది. ఇదే సినిమా హిందీ వెర్షన్ లోనూ తన అభినయంతో రంజింపజేశారు ఏయన్నార్. 
5. గుండమ్మ కథ: తెలుగువారిని విశేషంగా అలరించిన సాంఘీక చిత్రాల్లో గుండమ్మ కథది ప్రత్యేక స్థానం. టైటిల్ రోల్ లో సూర్యకాంతం నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అక్కినేని. కమలాకర కామేశ్వరరావు ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దారు.
6. మూగ మనసులు: పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ క్లాసిక్.. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో గోపి పాత్రలో తన నటనతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు అక్కినేని. ఈ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేశారు. 
7. దసరా బుల్లోడు: వీబీ రాజేంద్ర ప్రసాద్ రూపొందించిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో.. టైటిల్ రోల్ లో మురిపించారు ఏయన్నార్. "పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల" పాటలో తన చిందులతో కనువిందు చేశారు.
8. ప్రేమ నగర్: ప్రేమకథలకు చిరునామాగా నిలిచిన అక్కినేని నుంచి వచ్చిన అద్భుత ప్రణయగాథ.. ప్రేమ నగర్. సురేశ్ ప్రొడక్షన్స్ స్థాయిని పెంచిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ ని కె.యస్. ప్రకాశ రావు రూపొందించారు.
9. ప్రేమాభిషేకం: 527 రోజుల పాటు ప్రదర్శితమైన క్లాసిక్ లవ్ స్టోరీ.. ప్రేమాభిషేకం. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ విషాదాంత ప్రేమకథలో.. తనదైన అభినయంతో విశేషంగా అలరించారు అక్కినేని. ఈ సినిమాని దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించారు.
10. సీతారామయ్య గారి మనవరాలు:  తెలుగు ప్రజలను విశేషంగా అలరించిన కుటుంబ కథా చిత్రమిది. ఇందులో ఎలాంటి విగ్గు లేకుండా.. తాతయ్య పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నారు ఏయన్నార్. క్రాంతి కుమార్ తీర్చిదిద్దిన ఈ క్లాసిక్ లో సీతారామయ్యగా అక్కినేని అలరించగా.. మీనా టైటిల్ రోల్ లో ఆకట్టుకుంది. 

(సెప్టెంబర్ 20.. నటసామ్రాట్ ఏయన్నార్ జయంతి సందర్భంగా)