Read more!

English | Telugu

తెలుగులో తొలిసారి శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకొని రికార్డు సృష్టించిన సినిమా!

ఒకప్పుడు సినిమా విజయం సాధించింది అంటే ఎన్ని సెంటర్లలో వందరోజులు ప్రదర్శించారు, ఎన్ని సెంటర్లలో 175 రోజులు రన్‌ అయింది.. అనే విషయాల గురించి చర్చించుకునేవారు. అలా విజయం సాధించిన సినిమాలు తర్వాత మళ్ళీ మళ్ళీ రిలీజ్‌ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపించేవి. అలాంటి సినిమాల్లో ‘పాతాళభైరవి’ ఒకటి. ఈ సినిమా 28 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. అలాగే నాలుగు కేంద్రాల్లో 25 వారాలు ప్రదర్శించారు. తెలుగులో 100 రోజులు ప్రదిర్శింపబడిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే తొలి రజతోత్సవం జరుపుకొని రికార్డు సృష్టించిన సినిమా కూడా ఇదే. అంతేకాదు ఈ సినిమాను ఆ తర్వాత 500 ప్రింట్లు వేశారు. ఒరిజినల్‌ ప్రింటు చెరిగిపోతే రెండు నెగెటివ్‌ డూప్లికేట్స్‌ను కూడా తీశారు. ఇన్నిరకాలుగా ప్రింట్లు వేసిన సినిమా ఇది ఒక్కటే కావడం విశేషం. ‘పాతాళభైరవి’ సినిమాకి ఎన్నో విశేషాలు ఉన్నాయి.

అప్పట్లోనే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారానే మహానటి సావిత్రి చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం ‘రమ్మంటే రానే రాను...’ అనే పాటలో నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తితో కలిసి నటించింది. అప్పటికి సావిత్రి వయసు కేవలం 15 సంవత్సరాలే. ఈ సినిమాలో హీరోగా మొదట అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే బాలరాజు వంటి జానపద చిత్రాల్లో నటించిన అక్కినేని అయితే కరెక్ట్‌గా సరిపోతాడని భావించారు నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. కానీ, దానికి భిన్నంగా దర్శకుడు కె.వి.రెడ్డి ఆలోచించారు. ఎన్‌.టి.రామారావు ఈ సినిమాలోని తోట రాముడు పాత్రకు సరిపోతాడని, అతనైతేనే ఆ క్యారెక్టర్‌కి న్యాయం చెయ్యగలడని నిర్మాతలను ఒప్పించారు. అలాగే మాంత్రికుడి పాత్రకు మొదట ముక్కామలను అనుకున్నారు. హీరోని ఎలాగూ మార్చాం కాబట్టి విలన్‌ పాత్రకు కూడా వేరే వారిని తీసుకోవాలనుకున్నారు కె.వి.రెడ్డి. అప్పుడు ఎస్‌.వి.రంగారావును ఎంపిక చేవారు. 1950 ఫిబ్రవరి 5న షూటింగ్‌ ప్రారంభించారు. 1951 ఫిబ్రవరి 18 నాటికి షూటింగ్‌ పూర్తయింది. 1951 మార్చి 15న సినిమాను విడుదల చేశారు. 

‘పాతాళ భైరవి’ చిత్రాన్ని రిలీజ్‌కి ముందే విజయవాడ దుర్గా కళామందిర్‌లో సత్యనారాయణ అనే పంపిణీదారుడు డిస్ట్రిబ్యూటర్ల కోసం ప్రదర్శించారు. సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత ఇది నాలుగు వారాల కంటే ఎక్కువ ఆడదు అని తేల్చేశారు. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పారు. దాంతో నిర్మాత చక్రపాణి సత్యనారాయణపై మండిపడ్డారు. సినిమాను చూసి తీర్పు చెప్పాల్సింది మీరు కాదు, ప్రేక్షకులు. వారి కోసమే నేను సినిమా తీసింది అంటూ సినిమా మీద ఎంతో నమ్మకంగా చెప్పారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఆయా డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టుగానే ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి నీరసపడిపోయారు. కానీ, రెండు వారాల తర్వాత నుంచి సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. రోజురోజుకీ కలెక్షన్లు పెరిగాయి. దాంతో ప్రింట్లు, థియేటర్లు కూడా పెంచాల్సి వచ్చింది. అలా ‘పాతాళభైరవి’ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. అప్పట్లో విజయ సంస్థలో సినిమా చేస్తే హీరో నుంచి టెక్నీషియన్స్‌ వరకు అందరికీ నెల జీతమే ఇచ్చేవారు. అంతేకాదు, ముఖ్యమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ ఆ సంస్థకు నాలుగు సినిమాలు చెయ్యాలనే షరతు కూడా పెట్టేవారు. ‘పాతాళభైరవి’ పెద్ద హిట్‌ అవ్వడంతో సినిమాకి పనిచేసిన యూనిట్‌ సభ్యులందరికీ మూడు నెలల జీతం బోనస్‌ ప్రకటించింది విజయ సంస్థ. ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలతో విజయ వాహిని స్టూడియోలను మరింత అభివృద్ధి చేశారు.