English | Telugu

అర్థరాత్రి అడవిలో నక్కల బారిన పడిన అల్లు రామలింగయ్య.. అప్పుడేమైంది?

పాతరోజుల్లో సినిమాల షూటింగులన్నీ దాదాపుగా స్టూడియోల్లోనే జరిగేవి. కొన్ని సన్నివేశాలు మాత్రమే తప్పనిసరి అయితే ఔట్‌డోర్‌లో తీసేవారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ఔట్‌డోర్‌ షూటింగ్స్‌ మొదలుపెట్టారు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కొన్ని ఔట్‌డోర్స్‌లో వింత అనుభవాలు ఎదురవుతూ ఉండేవి. సందర్భం వచ్చినపుడు వాటి గురించి చెబుతూ ఆ సమయంలో వారు ఎలా ఫీల్‌ అయ్యేవారో వివరిస్తుంటారు. అలాంటి ఓ వింత అనుభవం అల్లు రామలింగయ్యకు జరిగింది. 1960వ దశకంలో ఆయన చేసిన ఓ సినిమా షూటింగ్‌ కోసం ఔట్‌డోర్‌కి వెళ్లాల్సి వచ్చింది. కాల్వ గట్ల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు యూనిట్‌ అంతా అక్కడికి వెళ్లింది. ఆరోజు ఉదయం షూటింగ్‌ మొదలైంది. అల్లు రామలింగయ్య పాల్గొన్న కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు దర్శకుడు. మధ్యాహ్నం అయిన తర్వాత షూటింగ్‌కి కొంత గ్యాప్‌ ఇచ్చారు. మిట్ట మధ్యాహ్నం ఎండ పైనుంచి పడుతుంది. ఆ సమయంలో కొందరు డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్లు షూటింగ్‌ చెయ్యరు. ఆ విషయం అల్లుకి అప్పుడే తెలిసిందట.

అది లంచ్‌ టైమ్‌ కావడంతో అందరితో కలిసి భోజనం చేశారు అల్లు రామలింగయ్య. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీయడం ఆయనకు అలవాటు. ఎక్కడ ఉన్నా సరే అరగంటైనా నిద్ర పోవాల్సిందే. అలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. భోజనం తర్వాత ఒక చుట్ట కాల్చుకొని నిద్రలోకి జారుకోవడానికి రెడీ అయ్యారు అల్లు. ఆ సమయంలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వచ్చి ‘మీరు చెయ్యాల్సిన సీన్‌ రావడానికి చాలా సమయం పడుతుంది. ఓ గంటసేపు హాయిగా నిద్రపోండి’ అని చెప్పాడు. అది విన్న అల్లుకి ఆనందం కలిగింది. చుట్ట కాల్చడం పూర్తయిన తర్వాత వెంటనే నిద్రలోకి జారుకున్నారు. అలా చాలా సేపు నిద్రలోనే ఉండిపోయారు. ఆయనకు సడన్‌గా మెలకువ వచ్చింది. అడవిలాంటి ప్రాంతం కావడంతో ఒక్క లైట్‌ కూడా లేదు. అంతా చిమ్మ చీకటి. తోటి నటీనటులుగానీ, యూనిట్‌ సభ్యులుగానీ ఎవరూ లేరు.

తను చెయ్యాల్సిన సీన్లు ఉన్నాయి. అయినా తనను నిద్ర లేపకుండా అందరూ ఎలా వెళ్లిపోయారు అనేది అల్లుకి అర్థం కాలేదు. తను చీకటిలో ఒంటరిగా ఉన్నానన్న విషయం గుర్తొచ్చి ఆయనకు ఒక్కసారిగా భయం వేసింది. అది కాలవ గట్టు కావడంతో కప్పలు, కీచురాళ్ళ శబ్ధం తప్ప ఏమీ వినిపించడం లేదు. దూరంగా ఎక్కడో నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. ఆయనకు భయం మరింత పెరిగింది. కాసేపటికి చీకటి అలవాటై లీలగా కాలువ, చెట్లు కనిపిస్తున్నాయి. ఏం చెయ్యాలో తోచక.. దిక్కులు చూస్తున్న ఆయనకు ఒక నక్కల గుంపు కనిపించింది. నక్కలు తనవైపే తీక్షణంగా చూస్తున్నట్టు అనిపించింది. మెల్లగా తనవైపు రావడం మొదలుపెట్టాయి. ఇక భయం తట్టుకోలేక గట్టిగా కేక పెట్టారు అల్లు. ఆ వెంటనే ‘సైలెన్స్‌’ అనే మాట వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచారు. అప్పుడుగానీ ఆయనకు అర్థం కాలేదు అది కల అని.

ఒక్కసారి లేచి చుట్టూ చూశారు అల్లు. యధావిధిగా షూటింగ్‌ జరుగుతోంది. ఆయన వేసిన కేకకు దగ్గరికి వచ్చిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ‘ఏంటి సార్‌.. మీ సీన్స్‌ రావడానికి టైమ్‌ పడుతుంది, గంట సేపు హాయిగా పడుకోమని చెప్పానుగా. అంతలోనే లేచిపోయారేంటి? పైగా కేకలు కూడా పెడుతున్నారు’ అన్నాడు. కాసేపటికి తేరుకున్న అల్లుకి మనసు కుదుటపడిరది. అదంతా కల అని నమ్మకలేకపోయారు. మళ్లీ నిద్రలోకి వెళ్లేందుకు రెడీ అయి కళ్లు మూసుకున్నారు. అంతలోనే తనకు వచ్చిన కల గుర్తొచ్చి చటుక్కున లేచి కూర్చున్నారు. ‘నాకు నిద్రా వద్దు, రెస్టూ వద్దు.. మీరు ఎప్పుడు నా సీన్‌ తీస్తే అప్పటివరకు వెయిట్‌ చేస్తాను’ అని ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి చెప్పి పంపించారు. అలా తనకు ఔట్‌డోర్‌లో ఎదురైన వింత అనుభవం గురించి వివరించారు అల్లు రామలింగయ్య.