English | Telugu
68 ఏళ్ళ నాటి అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవంలో ఏం జరిగిందో తెలుసా?
Updated : Sep 19, 2025
(సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా..)
1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రంలోని ఒక పాటలో పది మంది పిల్లల్లో ఒకరిగా తొలిసారి వెండితెరపై కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ జననం’ చిత్రంలో శ్రీరాముడిగా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా అక్కినేనికి నటుడిగా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ వెంటనే ‘మాయలోకం’, ‘ముగ్గురు మరాఠీలు’, ‘పల్నాటి యుద్ధం’, ‘రత్నమాల’ చిత్రాలు అక్కినేనిని మంచి నటుడిగా తీర్చిదిద్దాయి. ఆ తర్వాత వచ్చిన జానపద చిత్రాలు ‘బాలరాజు’, ‘కీలుగుర్రం’ వంటి సినిమాలు ఎఎన్నార్‌ను స్టార్ హీరోని చేశాయి. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో మైలురాయి సినిమాగా చెప్పుకునే ‘దేవదాసు’ చిత్రం 1953లో విడుదలైంది.
దేవదాసు పాత్రకు ఎఎన్నార్ న్యాయం చెయ్యలేడని అందరూ భావించారు. ఆ చిత్ర నిర్మాణం మానుకోమని నిర్మాత డి.ఎల్.నారాయణకు ఇండస్ట్రీలోని చాలా మంది చెప్పారు. డి.ఎల్. మాత్రం పట్టు విడవకుండా ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధపడ్డారు. ఎంతో కృషి చేసి దేవదాసు పాత్రను అత్యద్భుతంగా పోషించి.. తనను విమర్శించిన వారికి సమాధానం చెప్పారు అక్కినేని. తెలుగు సినిమా చరిత్రలో టాప్ టెన్ సినిమాల్లో నిలిచే సినిమాగా ‘దేవదాసు’ను చెప్పుకుంటున్నామంటే ఆ సినిమాను అక్కినేని ఎంత ప్రాణం పెట్టి చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా తర్వాత ‘కన్యాశుల్కం’, ‘చిరంజీవులు’ చిత్రాల్లో నటించాల్సిందిగా ఎఎన్నార్‌ను కోరారు డి.ఎల్.నారాయణ. అవి తను చేయదగ్గ పాత్రలు కావని అక్కినేని తిరస్కరించారు. ఆ రెండు సినిమాల్లో ఎన్.టి.రామారావు నటించారు.
1957లో మరో దృశ్యకావ్యం ‘మాయాబజార్’ విడుదలైంది. ఇది అక్కినేని నటించిన 56వ సినిమా. అదే సమయంలో మరో కథతో అక్కినేని దగ్గరకు వెళ్లారు డి.ఎల్. ఆ సినిమా పేరు ‘దొంగల్లో దొర’. అది మాస్ సినిమా కావడం, తన 60 సినిమా కావడంతో చేసేందుకు ఒప్పుకున్నారు అక్కినేని. 1957లోనే ఈ సినిమా కూడా విడుదలైంది. 60 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో తనను ప్రోత్సహించిన నిర్మాతలను సత్కరించాలని భావించారు అక్కినేని. చిత్ర పరిశ్రమ మొత్తం తరలి వచ్చే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలి అనేది ఆయనకు అర్థం కాలేదు. ఆ సమయంలో విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి.. దానికి కావాల్సిన స్థలం తను ఏర్పాటు చేస్తానని చెప్పారు.
వాహిని స్టూడియో ఎదురుగా నాగిరెడ్డికి చెందిన 24 ఎకరాల అడవిలాంటి ప్రదేశం ఉండేది. అక్కడి చెట్లన్నీ కొట్టించి చక్కని గార్డెన్‌లా తీర్చిదిద్దారు. రోడ్లు వేయించి, సభ నిర్వహించేందుకు వేదిక, కార్యక్రమానికి వచ్చిన అతిథులు భోజనం చేసేందుకు ఒక పెద్ద హాలు ఏర్పాటు చేశారు. అక్కినేని నటించిన 60 సినిమాల్లోని మంచి సన్నివేశాలను తీసుకొని ఒక చిత్రమాలగా తయారు చేశారు ఆదుర్తి సుబ్బారావు. వాటిని ప్రదర్శించేందుకు ఒక పెద్ద తెర, ప్రొజెక్టర్ కూడా తెప్పించారు. అక్కినేనిని ప్రోత్సహించిన నిర్మాతలకు అందించేందుకు జ్ఞాపికలు తయారు చేయించారు. వాటిని కళా దర్శకుడు ఎస్.కృష్ణారావు రూపొందించారు. 68 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఫంక్షన్‌కు 30 వేల రూపాయలు ఖర్చయింది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అధ్యక్షత వహించారు. నటుడు చిత్తూరు నాగయ్య అందరికీ స్వాగతం పలికారు. అక్కినేని నాగేశ్వరరావును ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ ప్రముఖులు పంపిన సందేశాలను ఎన్.టి.రామారావు చదివి వినిపించారు. అక్కినేనితో సినిమాలు నిర్మించిన నిర్మాతల పేర్లను జెమినీ గణేశన్ చదువుతుండగా ఒక్కొక్కరు వచ్చిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు. ఈ వేడుకలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 25,000 రూపాయలు విరాళం అందించారు అక్కినేని నాగేశ్వరరావు. ఫంక్షన్ దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు శివాజీ గణేశన్. ఇలా అక్కినేని నాగేశ్వరరావు వజ్రోత్సవంలో ఆనాటి ప్రముఖులంతా పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ఫంక్షన్‌కి వచ్చిన 4 వేల మందికి చక్కని విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత అక్కినేని చిత్రమాలను ప్రదర్శించారు.
అక్కినేని వజ్రోత్సవం జరిగిన ప్రదేశాన్ని షూటింగులకు అనువుగా మరింత అభివృద్ధి చేశారు విజయ అధినేతలు. అలా విజయా గార్డెన్స్‌లో ఆ తర్వాత ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిగాయి. వజ్రోత్సవం నిర్వహణకు అయిన ఖర్చు 30 వేల రూపాయలను నాగిరెడ్డికి ఇచ్చేందుకు ప్రయత్నించారు అక్కినేని. కానీ, ఆయన తీసుకోలేదు. అలా రుణం ఉంచుకోకూడదన్న ఉద్దేశంతో ఆ తర్వాత విజయ సంస్థ నిర్మించిన ‘గుండమ్మ కథ’ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటించారు అక్కినేని. సినిమా చాలా పెద్ద హిట్ అయి కనక వర్షం కురిసింది. ఆ సమయంలో నాగిరెడ్డి పారితోషికం ఇవ్వాలని చూశారు. కానీ, అక్కినేని మాత్రం పారితోషికం వద్దన్నారు.