English | Telugu

50 వసంతాల ‘లక్ష్మణరేఖ’. సహజనటి జయసుధను వెలుగులోకి తెచ్చిన సినిమా ఇదే!

‘పండంటి కాపురం’ చిత్రంతో నటిగా పరిచయమైన జయసుధ.. ఆ తర్వాత నోము, సోగ్గాడు వంటి సినిమాల్లో నటించిన తర్వాత ఎన్‌.గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మణరేఖ’ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించారు. 12 సెప్టెంబర్‌, 1975లో విడుదలైన ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నటిగా జయసుధకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. తనలోని నటిని వెలికి తీసి ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ సినిమా ఎంతో వైవిధ్యంతో కూడిన కథతో రూపొందింది. స్త్రీకి స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, అది శృతి మించితే ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుంది అనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమైన ఎన్‌.గోపాలకృష్ణ.. ‘లక్ష్మణరేఖ’ను ఆయన ఇంటిపేరుగా మార్చుకున్నారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్వతంత్ర భావాలు కలిగిన కవితగా జయసుధ నటించారు. తండ్రి(గుమ్మడి) తెచ్చిన సంబంధం కాదని, తను ప్రేమించిన రమేష్‌(చంద్రమోహన్‌)ను పెళ్ళి చేసుకుంటానని పట్టుపడుతుంది కవిత. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చిన సంబంధాన్ని ఒప్పుకొని మోహన్‌(మురళీమోహన్‌)తో పెళ్లికి సిద్ధపడుతుంది. పెళ్లి జరుగుతున్న సమయంలో తను ప్రేమించిన రమేష్‌ వచ్చి ఆమెను తీసుకెళ్లిపోతాడు. పెళ్లి పీటల మీద నుండి కూతురు వెళ్లిపోవడంతో తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. అయితే అదే ముహూర్తానికి మోహన్‌కు కవిత చెల్లెలు ఊర్మిళను ఇచ్చి పెళ్లి చేస్తారు. కవితను తీసుకెళ్లిన రమేష్‌.. ఆమెను ఓ వేశ్యాగృహానికి అమ్మేస్తాడు. కవిత అక్కడే జీవితం సాగిస్తుంటుంది. ఆ తర్వాత రమేష్‌ వల్లే మోహన్‌, ఊర్మిళ దంపతుల మధ్య కలతలు వస్తాయి. వారిని కలిపేందుకు కవిత ప్రయత్నిస్తుంది. ఆ సందర్భంలోనే మోహన్‌, ఊర్మిళ ఆ ఇంటికి వస్తారు. అదే టైమ్‌కి రమేష్‌కి కూడా అక్కడికి వస్తాడు. రమేష్‌, కవిత మధ్య ఘర్షణ జరుగుతుంది. అనుకోకుండా కవిత చేతిలో ప్రాణాలు కోల్పోతాడు రమేష్‌. కవితను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఆమెకు 7 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు. దాంతో సినిమా ముగుస్తుంది.

50 సంవత్సరాల క్రితమే ఈ తరహా కథతో సినిమా రూపొందడం, దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించి విజయం చేకూర్చడం విశేషంగానే చెప్పుకోవాలి. కవితగా జయసుధ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇక నెగెటివ్‌ క్యారెక్టర్‌లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు చంద్రమోహన్‌. కూతుళ్ల జీవితాలు ఏమైపోతాయోనని ఆందోళన పడే తండ్రిగా గుమ్మడి నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకులకు ‘లక్ష్మణరేఖ’ తప్పకుండా నచ్చుతుంది.