Read more!

English | Telugu

ఎన్నో అవరోధాల తర్వాత ‘పాతాళభైరవి’తో చరిత్ర సృష్టించి 300 సినిమాల్లో నటించిన ఎస్వీ రంగారావు!

సినిమాల్లో నటించాలని, గొప్ప పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది ఆశపడతారు, కలలు కంటారు. అయితే అందరి ఆశలు నెరవేరవు, కలలు నిజం కావు. ఒకప్పుడు అందరూ నాటక రంగం నుంచి వచ్చినవారే. అయితే నాటకాల కంటే సినిమాల ద్వారానే ఎక్కువ పాపులర్‌ అయ్యారందరూ. అలా నాటక రంగం నుంచి వచ్చి గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్నవారిలో ఎస్‌.వి.రంరావు ఒకరు. 

15 ఏళ్ళ వయసులోనే ఒక నాటకంలో ఒక మాంత్రికుడికి అసిస్టెంట్‌గా నటించారు రంగారావు. అదే మాంత్రికుడి పాత్రతో చరిత్ర సృష్టిస్తానని ఆయనకు తెలియదు. ఆ నాటకంలో తన నటనను అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత కాకినాడలో బిఎస్సీ చదువుతుండగా యంగ్‌మెన్‌ హ్యాపీ క్లబ్‌ వారితో కలిసి పలు నాటకాల్లో నటించారు. బిఎస్సీ పూర్తి చేసిన తర్వాత ఎం.ఎస్‌సి. చెయ్యాలని అనుకున్నారు. ఆ సమయంలో ఛోలెనర్‌ అనే అతని అభిమాని ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఎస్‌.వి.రంగారావు పర్సనాలిటీ చూసి నీకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఆ ఉద్యోగంలో చేరిపోయారు. ఆ తర్వాత రంగారావు బంధువు ఒకాయన ‘వరూధిని’ అనే సినిమా నిర్మిస్తున్నారు. అందులో ప్రవరాఖ్యుడి వేషానికి ఎస్‌.వి.రంగారావుని సంప్రదించారు. ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర చేస్తావా అని ఆయన్ని అడిగారు. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నా.. అది ఆయనకు అంత సంతృప్తికరంగా లేదు. ఎప్పుడు అవకాశం వస్తుందా ఉద్యోగం మానేద్దాం అని ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. 

సినిమా పూర్తయి విడుదలైంది. కానీ, సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలా మంది నిర్మాతలు ఆయనకి తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామని అన్నారు. కానీ, ‘వరూధిని’ ఫ్లాప్‌ అవ్వడంతో ఎవ్వరూ ఆ ఊసు ఎత్తలేదు. చేసేది లేక మళ్లీ ఉద్యోగం  కోసం వేట మొదలుపెట్టారు. జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌ కంపెనీలో గుమస్తా ఉద్యోగంలో జాయిన్‌ అయ్యారు. అప్పుడే తన మేనమామ కూతురితో రంగారావు పెళ్లి జరిగింది. అప్పుడే ఆయన జీవితం ఓ మలుపు తిరిగింది. కాకినాడలో రంగారావుతో కలిసి నాటకాలు వేసిన బి.ఎ.సుబ్బారావు ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో విలన్‌ వేషం ఉందని, నీకు ఇస్తానని రంగారావుకి టెలిగ్రాం ఇచ్చారు. అదే సమయంలో ధవళేశ్వరం నుంచి మరో టెలిగ్రామ్‌ వచ్చింది, ఆయన తండ్రి చనిపోయారని. మడ్రాస్‌ వెళ్ళాలా, ధవళేశ్వరం వెళ్లాలా అని ఆలోచించిన రంగారావు కొడుకుగా తను కార్యక్రమాలు నిర్వహించాలి కాబట్టి ధవళేశ్వరం వెళ్లారు. అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేసుకొని మద్రాస్‌ వెళ్ళారు. చెప్పిన టైమ్‌కి వెళ్ళలేకపోయిన కారణంగా ఆ పాత్రను వేరొకరికి ఇచ్చారు సుబ్బారావు. ఆ తర్వాత పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘తిరుగుబాటు’ అనే సినిమాలో చిన్న వేషం వేసారు. ఈ సినిమాలో అవకాశం ఎల్‌.వి.ప్రసాద్‌ వల్లే వచ్చింది. అది కూడా గుర్తింపు తీసుకురాలేదు. 

అయితే ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమా, నటుడిగా స్థిరపడేలా చేసిన సినిమా ‘షావుకారు’. ఈ సినిమాకి ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకుడు. రంగారావుకి మంచి పాత్రలు ఇప్పించాలని ప్రయత్నించిన వారిలో ముఖ్యులు ఎల్‌.వి.ప్రసాద్‌. ‘షావుకారు’ సినిమా అంతగా ఆడలేదుగానీ సున్నం రంగడు పాత్ర చేసిన ఎస్‌.వి.రంగారావుకు చాలా మంచి పేరు వచ్చింది. ఎస్‌.వి.రంగారావు అనే అద్భుతమైన నటుడు చలనచిత్ర రంగానికి వచ్చాడని అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమా ‘పాతాళభైరవి’. ఒక చరిత్ర సృష్టించిన సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ మాస్‌ హీరో అయ్యారు. ఇందులో నేపాల మాంత్రికుడిగా నటించిన ఎస్‌.వి.రంగారావు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పుడు మొదలైన సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ఎస్‌.వి.రంగారావు.