English | Telugu
కృష్ణ 'నేనంటే నేనే'కి 55 ఏళ్ళు.. ఏ సినిమాకి రీమేకో తెలుసా!
Updated : Sep 6, 2023
సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు వి. రామచంద్రరావు కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో 1968 నాటి 'నేనంటే నేనే' సినిమా ఒకటి. ఇందులో కృష్ణకి జంటగా అందాల తార కాంచన నటించింది. కృష్ణంరాజు, నాగభూషణం, చంద్రమోహన్, రావికొండలరావు, నెల్లూరు కాంతారావు, కేవీ చలం, సూర్యకాంతం, జూనియర్ శ్రీరంజని, రాధా కుమారి, మాస్టర్ బాబు, బేబీ శాంతికళ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. "ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావంటే.." అంటూ సాగే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోనిదే.
తమిళంలో విజయం సాధించిన 'నాన్' (రవిచంద్రన్, జయలలిత)కి రీమేక్ గా 'నేనంటే నేనే' రూపొందింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మసాలా సినిమా.. తమిళ వెర్షన్ తరహాలోనే కాసుల వర్షం కురిపించింది. ఎస్పీ కోదండపాణి సంగీతం, ఎస్. వెంకట రత్నం ఛాయాగ్రహణం.. 'నేనంటే నేనే'కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుజాత ఫిల్మ్స్ పతాకంపై పి.ఎన్. బాబ్జీ నిర్మించిన 'నేనంటే నేనే'.. 1968 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందు నిలిచింది. నేటితో ఈ జనరంజక చిత్రం 55 వసంతాలు పూర్తిచేసుకుంది.