English | Telugu

"గరం గరంపప్పు ఇది బరంపురం పప్పు".. ఈ పాట గల కృష్ణ సినిమాకి 50 ఏళ్ళు..!

అందమే జీవితమని కల కన్న ఓ అమ్మాయి.. ఓ ఘటన తరువాత జీవితమే కల అని అర్థం చేసుకుంటుంది. ఈ క్రమంలో.. ఆమెకు అండగా నిలిచెందవరు? తిరిగి తన జీవితానికి పరిపూర్ణత తెచ్చిందెవరు? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా 'మమత'.

సూపర్ స్టార్ కృష్ణ సరసన కనువిందు చేసిన నాయికల్లో అందాల తార జమున ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ వచ్చాయి. ప్రేక్షకాదరణను సైతం చూరగొన్నాయి. అలా జనరంజకంగా నిలిచిన సినిమాల్లో 1973 నాటి 'మమత' ఒకటి. 'దేవుడు చేసిన మనుషులు'వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కృష్ణ నుంచి వచ్చిన సినిమా ఇది. ఇందులో కృష్ణ, జమున వైద్యులుగా కనిపించడం విశేషం. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సత్యనారాయణ, చంద్రమోహన్, పద్మశ్రీ నాగయ్య, మిక్కిలినేని, సాక్షి రంగారావు, సారథి, విజయలలిత, రమాప్రభ, హేమలత, రాధాకుమారి ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి.. శాంతి పాత్రలో బాలనటిగా ఎంటర్టైన్ చేశారు. కేసీ శేఖర్ స్వయంగా కథను అందించి మరీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. పినిశెట్టి, అప్పలాచార్య సంభాషణలు సమకూర్చారు. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్ ప్లే సైతం సమకూర్చారు.

స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి ఆత్రేయ, అప్పలాచార్య సాహిత్యమందించారు. "మెరిసే మెరుపును నిలిపేదెవరు వలచే వలపుని ఆపేదెవరు" (రెండు వెర్షన్స్), "గోవిందాహరి గోవిందా", "నిన్న దాకా నేను నేనే నువ్వూ నువ్వే.. నేటినుంచి నువ్వే నేను నేనే నువ్వు," "రారండమ్మా పేరంటాళ్ళు.. చూడండమ్మా పెళ్ళి సంబరాలు", "గరం గరం పప్పు ఇది బరంపురం పప్పు".. అంటూ మొదలయ్యే ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 1973 సెప్టెంబర్ 6న జనం ముందు నిలిచిన 'మమత'.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది.