English | Telugu
22 ఏళ్ళ 'నువ్వు నాకు నచ్చావ్'.. రిరిలీజ్ కి స్పెషల్ డేట్!?
Updated : Sep 6, 2023
తెలుగునాట కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. తను నటించిన ఫ్యామిలీ డ్రామాలెన్నో బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో 'నువ్వు నాకు నచ్చావ్'దిప్రత్యేక స్థానం. 'నువ్వే కావాలి' వంటి ఘనవిజయం తరువాత దర్శకుడు కె. విజయ భాస్కర్ రూపొందించిన ఈ సినిమాకి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేశారు. కోటి స్వరాలు సమకూర్చారు. ఇందులో వెంకటేశ్ కి జంటగా ఆర్తి అగర్వాల్ నటించింది. తనకిదే మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్, ఆశా షైనీ, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సుధ, హేమ, బేబి సుదీప, తనికెళ్ళ భరణి, సిజ్జు, శ్రీలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
శ్రీనివాస మూర్తి (ప్రకాశ్ రాజ్), శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రులు. మూర్తి కూతురు నందిని (ఆర్తి అగర్వాల్), శేఖరం కొడుకు వెంకటేశ్వర్లు (వెంకటేశ్). నిరుద్యోగి అయిన తన కొడుకుకి ఓ దారి చూపిస్తాడని వెంకీని మూర్తి ఇంటికి పంపిస్తాడు శేఖరం. అదే సమయంలో నందుకి నిశ్చితార్థం జరుగుతుంది. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వెంకీతో ప్రేమలో పడుతుంది నందు. వెంకీకి కూడా నందు అంటే ఇష్టమే అయినా.. పెద్దవారి స్నేహం తమ ప్రేమ వల్ల చెడకూడదు అని భావించి ఆమెకి దూరంగా ఉంటుంటాడు. చివరికి వీరి ప్రేమకథ ఏ తీరాలకు చేరింది? అన్నదే మిగిలిన సినిమా. సింపుల్ స్టోరీ లైనే అయినా.. ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు రచయిత, దర్శకులు. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం, సంగీతం, శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణ విలువలు.. వెరసి 'నువ్వు నాకు నచ్చావ్' తెలుగునాట ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. 2001 సెప్టెంబర్ 6న జనం ముందు నిలిచిన 'నువ్వు నాకు నచ్చావ్'.. నేటితో 22 వసంతాలు పూర్తిచేసుకుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రిరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో 'నువ్వు నాకు నచ్చావ్' రిరిలీజ్ పై ఆసక్తి నెలకొంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న 'నువ్వు నాకు నచ్చావ్'ని రిరిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. అదే గనుక నిజమైతే.. రిరిలీజ్ లోనూ ఈ క్లాసిక్ వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయమే.