Read more!

English | Telugu

50 వ‌సంతాల‌ కౌబాయ్ క్లాసిక్ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'

 

టెక్నిక‌ల్‌గా తెలుగు సినిమా సాధించిన ప‌లు ఘ‌న‌త‌ల్లో, తిరిగిన‌ ప‌లు మ‌లుపుల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఉన్నారు. అలాంటి మ‌లుపే 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'. ఆ సినిమా విడుద‌లై ఆగ‌స్ట్ 27కు స‌రిగ్గా 50 సంవ‌త్స‌రాలు. అంటే 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' స్వ‌ర్ణోత్స‌వం జ‌రుపుకుంటోంద‌న్న మాట‌. ఈ సినిమాతో తెలుగు సినిమాని సాంకేతికంగా ఇంకో అడుగు ముందుకు వేయించారు కృష్ణ‌. కౌబాయ్‌కీ, ఇండియాకీ అస‌లు సంబంధ‌మే లేదు. అయినా కౌబాయ్ తెలుగువాడే అన్న‌ట్లుగా ప్రేక్ష‌కుల్ని భ్ర‌మింప‌జేసి, ఘ‌న‌విజ‌యం సాధించారు. కౌబాయ్ అనేవాడు నార్త్ అమెరికాకు సంబంధించిన‌వాడు. అందుకే హాలీవుడ్‌లో అనేక కౌబాయ్ సినిమాలు వ‌చ్చి అల‌రించాయి. కౌబాయ్‌గా హాలీవుడ్ సూప‌ర్‌స్టార్ క్లింట్ ఈస్ట్‌వుడ్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా రంజింప‌చేశారో చెప్ప‌క్క‌ర్లేదు.

ఒక‌సారి కృష్ణ‌కు ఆ త‌ర‌హా కౌబాయ్ క్యారెక్ట‌ర్ చెయ్యాలన్న కోరిక క‌లిగింది. క్రైమ్ స‌బ్జెక్టులు త‌యారుచేయ‌డంలో దిట్ట అయిన ఆరుద్ర ఆ క‌థ‌ను రాసే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. క్లింట్ ఈస్ట్‌వుడ్ న‌టించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' స‌హా కొన్ని కౌబాయ్ సినిమాలు చూసి, వాటి స్ఫూర్తితో స‌రికొత్త‌గా, మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లు క‌థ‌ను త‌యారుచేశారు ఆరుద్ర‌. ఇది ఏ సినిమాకీ కాపీ కాదు, ఒరిజిన‌లే అన్నంత‌గా ఆ క‌థ వ‌చ్చిందంటే ఆరుద్ర ప్ర‌తిభ అది. ఆ క‌థ కృష్ణ‌తో పాటు ఆయ‌న త‌మ్ముళ్లు హ‌నుమంత‌రావు, ఆదిశేష‌గిరిరావుల‌కూ బాగా న‌చ్చింది. ఆరుద్ర‌నే ఆ సినిమాని డైరెక్ట్ చెయ్య‌మ‌ని కోరారు కృష్ణ‌. కానీ ర‌చ‌యిత‌గా బాగా బిజీగా ఉండే ఆయ‌న ఆ ప‌ని చేయ‌లేన‌న్నారు.

దాంతో యాక్ష‌న్ సినిమాల డైరెక్ట‌ర్‌గా పేరుగాంచిన కె.ఎస్‌.ఆర్‌. దాస్‌కు ఈ సినిమా డైరెక్ష‌న్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. కృష్ణ‌. అప్ప‌టికే వారి కాంబినేష‌న్‌లో మూడు సినిమాలు వ‌చ్చాయి. ఇది నాలుగో సినిమా. ఆరుద్ర ఈ స్క్రిప్టుకు పెట్టిన టైటిల్ 'అదృష్ట‌రేఖ‌'. కానీ టైటిల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండాల‌నే ఉద్దేశంతో 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'గా మార్చారు. కె.ఎస్‌.ఆర్‌. దాస్ ఈ సినిమాని కృష్ణ ఊహించిన దానికి మించి గొప్ప‌గా రూపొందించార‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

కృష్ణ స‌ర‌స‌న నాయిక‌గా విజ‌య‌నిర్మ‌ల న‌టించ‌గా, నాగ‌భూష‌ణం, స‌త్య‌నారాయ‌ణ‌, జ్యోతిల‌క్ష్మి, ప్ర‌భాక‌ర‌రెడ్డి, త్యాగ‌రాజు, రావు గోపాల‌రావు, జ‌గ్గారావు, ఆనంద్ మోహ‌న్‌, రామ‌దాసు, సాక్షి రంగారావు, కాక‌రాల లాంటి ఉద్ధండులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు చేశారు.

1971 జ‌న‌వ‌రి 9న మ‌ద్రాసులోని వాహినీ స్టూడియోలో 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' షూటింగ్ మొద‌లైంది. ప్ర‌ముఖ నిర్మాత డూండీ కెమెరా స్విచ్చాన్ చేస్తే, కృష్ణ‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన దిగ్ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావు క్లాప్ కొట్టారు. రూ. 7 ల‌క్ష‌ల భారీ వ్య‌యంతో (ఆ రోజుల్లో) ఈ సినిమాని నిర్మించారు. ప‌ద్మాల‌యా బ్యాన‌ర్ మీద నిర్మాణ‌మైన రెండో సినిమా ఇది. రాజ‌స్థాన్‌లోని థార్ ఎడార్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. కేవ‌లం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేయ‌డం కృష్ణ సోద‌రుల ప్లానింగ్‌కు నిద‌ర్శ‌నం.

1971 ఆగ‌స్ట్ 27న విడుద‌లైన భార‌త‌దేశ‌పు తొలి కౌబాయ్ ఫిల్మ్‌ 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' విజ‌య దుందుభి మోగించింది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. కృష్ణ కెరీర్‌లో రూ. 50 ల‌క్ష‌లు పైగా క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసిన మొద‌టి సినిమా ఇదే. దాంతో ఇండియన్ కౌబాయ్‌గా కృష్ణ పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు. తెలుగులో 14 వేల అడుగుల‌తో ఈ సినిమా విడుద‌ల కాగా, దాన్ని 9 వేల అడుగుల‌కు కుదించి, 'ద‌ ట్రెజ‌ర్ హంట్' పేరుతో ఇంగ్లిష్‌లో డ‌బ్ చేయించారు కృష్ణ‌. తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి డ‌బ్ అయిన తొలి తెలుగు సినిమా 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు'. దాన్ని ఏకంగా 125 దేశాల్లో రిలీజ్ చేస్తే, అత్య‌ధిక దేశాల్లో స‌క్సెస్ అయ్యింది. 

ఒక తెలుగు సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ మాత్ర‌మే కాదు, ఒక ఇండియ‌న్ ఫిల్మ్ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఇన్ని దేశాల్లో రిలీజ‌వ‌డం రికార్డ్‌. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఇన్ని దేశాల్లో రిలీజైన ఇండియ‌న్ డ‌బ్బింగ్ ఫిల్మ్ అదొక్క‌టే. ఈ సినిమా ఘ‌న విజ‌యంలో సినిమాటోగ్రాఫ‌ర్ వి.ఎస్‌.ఆర్‌. స్వామి పాత్ర ఎంతో ఉంది. సినిమా మొత్తాన్ని బ్యాక్‌లైట్‌లోనే ఆయ‌న చిత్రీక‌రించారు.

విడుద‌ల‌కు ముందు ఈ సినిమా ప్రివ్యూ వేసిన‌ప్పుడు ఎన్టీఆర్ చూసి, కృష్ణ‌ను ప్ర‌శంసిస్తూ ఏకంగా ఒక లేఖ రాశారు. "సోదరుడు శ్రీ కృష్ణ తీసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా చూశాను.. ఎంతో ప్రయాసకులోనై విశిష్టమైన సాంకేతిక విలువతో, ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం, పట్టుదల ప్రతి షాటులోనూ, ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లీష్ చిత్రమా అనిపించింది. ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రాహణము.. ఇంత మ‌నోజ్ఞంగా ఉన్నత ప్రమాణంలో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినందనీయుడు. కథకు అనుగుణమైన వేగంతో దర్శకత్వం నిర్వహించిన శ్రీ దాస్‌ ప్రశంసాపాత్రుడు. ఇంత సాంకేతిక విలువలతో జాతీయత.. మన సాంఘిక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావపూరితములైన మహత్తర కళాఖండాలను అభిమానులకు శ్రీ కృష్ణ అందించగలరని ఆశిస్తూ.. సాహసోపేతమైన యీ చిత్ర నిర్మాణ కృషికి అతన్ని అభినందిస్తున్నాను. అని అందులో రాసుకొచ్చారు ఎన్టీ రామారావు.

హిందీలో ఈ సినిమా 'గ‌న్‌ఫైట‌ర్ జానీ' పేరుతో, త‌మిళంలో 'మోస‌క్కార‌నుక్కు మోస‌కార‌న్' పేరుతో రిలీజై స‌క్సెస్ సాధించింది. 'గ‌న్‌ఫైట‌ర్ జానీ' క‌ల‌క‌త్తా, పంజాబ్‌ల‌లోనూ బాగా ఆడింది. క‌ల‌క‌త్తాలో అయితే 20 ప్రింట్ల‌తో విడుద‌ల‌యింది. ఇలాంటి ఎన్నో విశేషాలు, ప్ర‌త్యేక‌త‌లు ఉన్న 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' కేవ‌లం కృష్ణ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనూ మైలురాయిగా నిలిచింది. తెలుగువాడు తీసిన సినిమాగా గ‌ర్వంగా చెప్పుకొనే వాటిలో ఒక‌టిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించింది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి