Read more!

English | Telugu

ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక పార్తీప‌న్‌-సీత ఒక అనాథ బాలుడ్ని ద‌త్త‌త తీసుకున్నార‌ని తెలుసా?

 

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన న‌టి సీత త‌మిళ ద‌ర్శ‌కుడు-న‌టుడు ఆర్‌. పార్తీప‌న్‌ను వివాహం చేసుకున్నార‌ని చాలా మందికి తెలుసు. 1990లో పెళ్లాడిన ఆ ఇద్ద‌రూ ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత 2001లో విడిపోయారు. అప్ప‌ట్నుంచీ పార్తీప‌న్ ఒంటరిగానే ఉంటున్నారు. సీత మాత్రం టీవీ న‌టుడు స‌తీశ్‌ను 2010లో రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. 2016లో స‌తీశ్‌కు కూడా సీత విడాకులిచ్చేశారు.

ఆ విష‌యం అలా ఉంచితే కె. భాగ్య‌రాజా శిష్యుడైన‌ పార్తీప‌న్ పుదియ పాదై (1989) అనే మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ సినిమాలో పార్తీప‌న్‌, సీత జంట‌గా న‌టించారు. ఒక అనాథ బాలుడు నేటి స‌మాజంలో ఎన్ని అవ‌స్థ‌లు పడుతూ జీవించాల్సి వ‌స్తుందో, అనాథ‌ను స‌మాజం ఎంత‌గా నిరాద‌రిస్తుందో ఆ సినిమాలో ద‌య‌నీయంగా చూపించారు పార్తీప‌న్‌. 

ఆ సినిమా విజ‌యోత్స‌వంలో పార్తీప‌న్ "నేను తీసిన సినిమాలో చెప్పిన సందేశాన్ని ఆచ‌రించి చూపిస్తాను. ఒక అనాథ శిశువును ద‌త్త‌త తీసుకొని పెంచుతాను" అని ప్ర‌మాణం చేశారు. సీత‌తో పెళ్ల‌య్యాక వారికి కీర్త‌, అభిన‌య అనే ఇద్ద‌రు కూతుళ్లు పుట్టారు. అయితే తాను 'పుదియ పాదై' విజ‌యోత్స‌వంలో చేసిన ప్ర‌మాణాన్ని పార్తీప‌న్ మ‌ర్చిపోలేదు. సీత అనుమ‌తితో చెన్నైలోని 'ఉద‌వుక్క‌రంగ‌ళ్' అనే ఆశ్ర‌మంలోని అనాథ బాలుడ్ని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరు రాధాకృష్ణ‌న్ అని పెట్టారు. 

ఇలా అనాథ శిశువుల‌ను స్థోమ‌త ఉన్న‌వారంద‌రూ ద‌త్త‌త తీసుకుని వాళ్ల జీవితాల్లో కొత్త కాంతులు ప్ర‌స‌రింప‌జేయాల‌ని, తాము చెయ్య‌ని త‌ప్పుకు శిక్ష అనుభ‌విస్తున్నామ‌నే బాధ ఆ చిన్నారుల్లో క‌ల‌గ‌నీయ‌రాద‌ని పార్తీప‌న్ ఉద్దేశం. ఈ విష‌యం అంద‌రి దృష్టికీ రావ‌డానికి ఆ పిల్లాడి నామ‌క‌ర‌ణోత్స‌వాన్ని చెన్నైలోని మ్యూజియం థియేట‌ర్‌లో ఒక బ‌హిరంగ స‌భ‌లో ఏర్పాటు చేశారు. రాధాకృష్ణ‌న్ మొద‌టి పుట్టిన‌రోజు పండుగ‌ని, ద‌త్త‌త స్వీకార మ‌హోత్స‌వాన్ని ఏర్పాటుచేసి, త‌న భావాల‌ను వివ‌రించారు. ఆ స‌భ‌లో గాన‌కోకిల పి. సుశీల ప్రార్థ‌నా గీతం ఆల‌పించ‌గా, సీత స్వాగ‌త వ‌చ‌నాలు చెప్పారు.

సీత‌తో విడిపోయాక పార్తీప‌న్ ముగ్గురు పిల్ల‌ల్నీ త‌నే పెంచుతూ వ‌చ్చారు. కీర్త‌న‌, అభిన‌య‌ల‌కు పెళ్లిళ్లు చేశారు. రాధాకృష్ణ‌న్ అలియాస్ రాఖీ తండ్రి ద‌గ్గ‌రే ఉండిపోయాడు. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్నాడు.