English | Telugu
మల్టిస్టారర్ మూవీ 'పుట్టినిల్లు మెట్టినిల్లు'కి 50 ఏళ్ళు.. 'కుండమార్పిడి' ఫ్యామిలీ డ్రామా
Updated : Jul 11, 2023
సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు కాంబినేషన్ లో పలు జనరంజక మల్టిస్టారర్స్ తెరకెక్కాయి. వాటిలో 'పుట్టినిల్లు మెట్టినిల్లు' ఒకటి. తమిళ చిత్రం 'పుగుంద వీడు' ఆధారంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాకి మాతృక నిర్దేశకుడైన పట్టు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీయమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో కృష్ణకి జంటగా చంద్రకళ కనిపించగా.. శోభన్ బాబుకి జోడీగా లక్ష్మి అభినయించింది. ఒక ముఖ్య పాత్రలో మహానటి సావిత్రి అలరించారు. మాతృకలో కూడా సావిత్రి, లక్ష్మి, చంద్రకళ ఇవే వేషాల్లో కనిపించడం విశేషం. హాస్యజంట రాజబాబు (ద్విపాత్రాభినయం), రమాప్రభ వినోదం ఈ సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చిత్ర కథాంశం విషయానికి వస్తే.. ఆగర్బ శ్రీమంతుడైన గోపి (కృష్ణ)కి చెల్లి లత (లక్ష్మి) అంటే ప్రాణం. లతకి చిన్నప్పట్నుంచి శుచి, శుభ్రత విషయంలో పట్టింపు ఎక్కువ. ఈ కారణంగానే కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారి తండ్రి (చిత్తూరు నాగయ్య).. లత కంటపడకుండా అజ్ఞాతంలో ఉండిపోతాడు. మరోవైపు పేదింటి కుర్రాడైన రవి (శోభన్ బాబు)కి సంగీతమంటే ప్రాణం. అతనికి తల్లి (సావిత్రి), చెల్లి వాసంతి (చంద్రకళ) ఉంటారు. రవి గాత్రానికి అభిమానైన లత.. అతణ్ణి ఆరాధిస్తుంది. రవి కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసి గోపి తొలుత కోప్పడ్డా.. చివరికి వారికి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే రవి తల్లి మాత్రం.. వాసంతి పెళ్ళి గురించి ఆందోళనపడుతుంది. దీంతో కుండమార్పిడి ఆలోచన చేస్తాడు గోపి. ఇందుకు రవి కుటుంబంకూడా అంగీకరిస్తుంది. పెళ్ళయ్యాక గోపి - వాసంతి బాగా దగ్గరైతే.. లత మాత్రం మెట్టింటి వాతావరణంలో ఇమడలేకపోతుంది. మరీముఖ్యంగా దగ్గుతో బాధపడుతున్న రవి తల్లిని చూసి అసహ్యించుకుంటుంది లత. దీంతో రవి - లత మధ్య సమస్యలు వచ్చి.. లత మెట్టింటి నుంచి పుట్టింటికి వస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న గోపి, వాసంతి సైతం.. లత కారణంగా విడిపోవాల్సి వస్తుంది. కొన్ని ఘటనల అనంతరం లత 'శుచి, శుభ్రత గొప్పవే కావచ్చు.. అందుకని ఎదుటివారిని హింసించడం అహంకారం' అని తెలుసుకుంటుంది. తండ్రి, అత్తని ఆదరిస్తుంది. దీంతో.. రెండు జంటల కథ సుఖాంతమవుతుంది.
కథ, కథనం, ప్రధాన పాత్రధారుల అభినయం, దర్శకత్వ ప్రతిభతో పాటు సంగీతం కూడా ఈ సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. సత్యం స్వరకల్పనలో రూపొందిన పాటల్లో 'గానగాంధర్వుడు' ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ''ఇదే పాట ప్రతీ చోట'' (రెండు వెర్షన్స్) సినిమాకి ఓ హైలైట్ గా నిలవగా.. "సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు", "చిన్నారి కన్నయ్య", "బోల్తా పడ్డావు" (రెండు వెర్షన్స్), "జమలంగిడి జమ్కా" గీతాలు కూడా రంజింపజేశాయి. ఈ పాటలకి సి. నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు, కొసరాజు రాఘవయ్య సాహిత్యమందించారు. 1973 జూలై 12న విడుదలై ప్రజాదరణ పొందిన 'పుట్టినిల్లు - మెట్టినిల్లు'.. బుధవారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.