English | Telugu
మ్యూజికల్ సెన్సేషన్ 'ఆర్ ఎక్స్ 100'కి ఐదేళ్ళు.. యూత్ కి పిచ్చెక్కించిన ఫిల్మ్
Updated : Jul 12, 2023
శరీర వాంఛలు తీర్చుకోవడానికి శివ అనే ఓ యువకుడిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఇందు అనే ఓ యువతి కథే.. 'ఆర్ ఎక్స్ 100'. నూతన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రం.. అప్పట్లో యువతని పిచ్చెక్కించింది. ఇందులో ప్రేమ పేరుతో మోసం చేసే యువతిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న కథానాయిక పాత్రలో పాయల్ రాజ్ పుత్ మెస్మరైజ్ చేయగా.. ఆ యువకుడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. రావు రమేశ్, రాంకీ ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఆర్ ఎక్స్ 100'కి ఛైతన్ భరద్వాజ్ అందించిన స్వరాలు ఎస్సెట్ గా నిలిచాయి. ఇందులోని "పిల్లా రా" చార్ట్ బస్టర్ సాంగ్ కాగా.. "మనసుని పట్టి", "రెప్పలనిండా", "అదిరే హృదయం", "రుధిరం మరిగి", "ధినకు ధిన దా" కూడా అలరించాయి. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన "ఆర్ ఎక్స్ 100".. పరిమిత బడ్జెట్ లో తయారై రూ 12. 45 కోట్లకు పైగా షేర్ రాబట్టిఅప్పట్లో వార్తల్లో నిలిచింది. అలాగే ఒడియాలో 'ప్రేమో న పాగలోపన'పేరుతోనూ, హిందీలో 'తడప్' పేరుతోనూ, కన్నడంలో 'శివ 143' పేరుతోనూ రీమేక్ అయింది. 2018 జూలై 12న విడుదలై ఘనవిజయం సాధించిన 'ఆర్ ఎక్స్ 100'.. నేటితో 5 వసంతాలు పూర్తిచేసుకుంది.