English | Telugu
గోపీచంద్ సాహసంకి పదేళ్ళు.. నిధి చుట్టూ తిరిగే యాక్షన్ ఎడ్వెంచర్
Updated : Jul 12, 2023
ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఒకదానితో ఒకటి పొంతనలేని కథలతో ప్రయాణం చేసే యేలేటి.. 'ఒక్కడున్నాడు' (2007) వంటి విభిన్న ప్రయత్నం తరువాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో కలిసి చేసిన సినిమా 'సాహసం'. నిధి చుట్టూ తిరిగే ఈ యాక్షన్ ఎడ్వెంచర్ ఫిల్మ్ లో తాప్సీ కథానాయికగా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్.. తెలుగులో నటించిన మూడో సినిమా ఇది. 'కలియుగ పాండవులు' (1986), 'యుద్ధభూమి' (1988) లో అలరించిన శక్తి కపూర్.. దాదాపు పాతికేళ్ళ తరువాత నటించిన టాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం.
చిత్ర కథాంశం విషయానికి వస్తే.. సెక్యూరిటీ గార్డ్ అయిన గౌతమ్ వర్మ (గోపీచంద్)కి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలన్నది ఆశ. అలాంటి అతనికి తన పూర్వీకుల ఆస్తులు పాకిస్తాన్ లోని ఓ పురాతన దేవాలయంలో సొరంగ మార్గం లోపల నిక్షిప్తమై ఉన్నాయని తెలుస్తుంది. అయితే, అప్పటికే అక్కడ ఉన్న నిధి కోసం పాకిస్తాన్ లో ఓ బృందం ప్రయత్నిస్తుంటుంది. శ్రీనిధి (తాప్సీ) సమేతంగా గౌతమ్ ఆ నిధిని ఎలా కనిపెట్టాడు? విలన్స్ బారి నుంచి ఆ నిధిని ఎలా రక్షించాడు? అన్నది మిగిలిన సినిమా.
శ్రీ నేపథ్య సంగీతం, శ్యామ్ దత్ ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచిన 'సాహసం'ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. 2013 జూలై 12న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించిన 'సాహసం'.. నేటితో పది వసంతాలు పూర్తిచేసుకుంది.