English | Telugu
రామ్ చరణ్ డిజాస్టర్ కి పదేళ్ళు.. ఆ గాయం మరువలేనిదే
Updated : Sep 6, 2023
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మొదటి సినిమా 'చిరుత'(2007) తోనే బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేసిన చరణ్.. ఆపై రెండో చిత్రంగా వచ్చిన 'మగధీర'(2009)తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో 'రంగస్థలం'(2018), 'ఆర్ ఆర్ ఆర్' (2022)తో నటుడిగానూ భలేగా మెప్పించాడు.
ఇదిలా ఉంటే, తన తండ్రి చిరంజీవి తరహాలోనే బాలీవుడ్ లోనూ నేరుగా అలరించే ప్రయత్నం చేశాడు రామ్ చరణ్. 1973 నాటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంచలన హిందీ చిత్రం 'జంజీర్'కి రీమేక్ గా రూపొందిన సదరు చిత్రమే 'జంజీర్'. తెలుగులో 'తుఫాన్'గా అనువాదమైన ఈ హిందీ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించగా.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ 2013 సెప్టెంబర్ 6న విడుదలైన 'జంజీర్' అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. చరణ్ పై విమర్శల వర్షం కురిపించింది. అంటే.. 'జంజీర్' అనే గాయం తెరపైకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్ళు అయిందన్నమాట.
ఏదేమైనా.. 'జంజీర్' చేసిన గాయాన్ని మరిపించేలా 'ఆర్ ఆర్ ఆర్' (2022)లోని రామరాజు పాత్రతో అక్కడి ప్రేక్షకులను తన అద్భుతాభినయంతో మెప్పించాడు చరణ్. నటుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. రాబోయే రోజుల్లో 'అంతకుమించి' అన్నట్లుగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతుండడం అభినందనీయ విషయమనే చెప్పాలి.