Read more!

English | Telugu

ఆ సినిమా చూసి 20 జంటలు ఆత్మహత్య.. డైరెక్టర్‌పై మానవ హక్కుల సంఘం ఫైర్‌!

కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి, కొన్ని సినిమాలు కంటతడి పెట్టిస్తాయి, మరికొన్ని సినిమాలు జీవితంలో విజయాలు సాధించడానికి ఇన్‌స్పిరేషన్‌ని ఇస్తాయి. అలా కాకుండా ఒక సినిమా చూసిన తర్వాత జీవితమంటేనే విరక్తి కలిగితే, ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పితే.. ఒక సినిమా విషయంలో అదే జరిగింది. తమ ప్రేమ విఫలమవుతుందనే భయంతో, తమని పెదలు విడదీస్తారనే బాధతో ఒక జంట ఆ సినిమాలో ఆత్మహత్యకు పాల్పడిరది. ఆ సినిమాని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని 20 జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. అంతేకాదు, తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సినిమాయే ఇన్‌స్పిరేషన్‌ అని సూసైడ్‌ నోట్‌ రాసి మరీ చనిపోయారంటే.. ఆ సినిమా యువ ప్రేమికుల్లో ఎంత గాఢమైన ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి సంచలనం సృషించిన ఆ సినిమా ఏమిటో తెలుసా? కమల్‌హాసన్‌, సరిత జంటగా కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మరోచరిత్ర’. 

ఆండాళ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.బాలచందర్‌ దర్శకత్వంలో రామ అరంగణల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలచందర్‌ రాసిన కథకు గణేష్‌ పాత్రో సంభాషణలు, ఆత్రేయ పాటలు రాశారు. ఈ సినిమాకి ఏ పేరు పెట్టాలి అనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. మొదట అనుకున్న పేరు మరో ప్రేమకథ. ప్రేమకథల్లోనే కొత్త దనం ఉన్న కథ కాబట్టి చరిత్ర అని వచ్చేలా ఉంటే బాగుంటుందని బాలచందర్‌ అన్నారు. అప్పుడు మరో ప్రేమచరిత్ర అనుకున్నారు. టైటిల్‌లోనే ప్రేమ అని ఉంటే లవ్‌స్టోరీ అని తెలిసిపోతుందని ఫైనల్‌గా ‘మరోచరిత్ర’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. 

ఇక సినిమాలో నటించే నటీనటుల ఎంపిక మొదలు పెట్టారు. హీరో కమల్‌హాసన్‌, యువ వితంతు పాత్రలో నటించేందుకు మాధవిని ఎంపిక చేశారు. ప్రధాన కథానాయిక పాత్ర కోసం మొదట జయప్రదను అనుకున్నారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత దీపను అడిగారు. బాలచందర్‌ అడిగిన డేట్స్‌ను ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’ చిత్రానికి ఇచ్చేశారు దీప. ఎంత ప్రయత్నించినా డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వలేదు. ఆ తర్వాత 160 మందికి స్క్రీన్‌ టెస్ట్‌ చేశారు. సంగీత దర్శకుడు టి.చలపతిరావు బంధువు కుమార్తె అభిలాషను ఒకసారి గణేష్‌ పాత్రో చూశారు. ఆ అమ్మాయి అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆండాళ్‌ ప్రొడక్షన్స్‌ ఆఫీస్‌లో ఆమెను బాలచందర్‌కు పరిచయం చేశారు. పొట్టిగా, నల్లగా ఉన్నప్పటికీ ఆమెలోని చలాకీతనం, తెలివితేటలు బాలచందర్‌కు బాగా నచ్చాయి. సినిమాలోని క్యారెక్టర్‌ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అభిలాష కరెక్ట్‌ సరిపోతుందని ఆమెనే సెలెక్ట్‌ చేశారు. ఆమె పేరును సరితగా మార్చారు బాలచందర్‌. ఈ సినిమా షూటింగ్‌ అంతా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగింది. 

1978 మే 19న ఈ సినిమా విడుదలైంది. సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలోని బాలు, స్వప్న క్యారెక్టర్లకు యూత్‌ బాగా కనెక్ట్‌ అయింది. ఈ సినిమాలోని పాటలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. ఆచార్య ఆత్రేయ, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ ఇద్దరూ టీనేజ్‌ కుర్రాళ్ళలా ఆలోచించి ఈ పాటలు చేశారు. అప్పట్లో ఈ పాటల్ని బట్టీ పట్టి మరీ పాడుకున్నారు యువతీయువకులు. తమిళనాడు అంతా ఈ సినిమా తెలుగు వెర్షన్‌నే రిలీజ్‌ చేస్తే అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. మద్రాస్‌లోని సఫైర్‌ థియేటర్‌లో 556 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇదే సినిమాను 1981లో ‘ఏక్‌ దూజే కే లియే’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఎల్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా కె.బాలచందర్‌ దర్శకత్వం వహించారు. హిందీలో కూడా ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. తెలుగు, హిందీ వెర్షన్స్‌ హైదరాబాద్‌లో 365 రోజులు ప్రదర్శింపబడ్డాయి. 

ఈ సినిమా ఎండిరగ్‌ ట్రాజెడీ అయితే ఆడియన్స్‌ శాటిస్‌ఫై అవ్వరని గణేష్‌ పాత్రో, ఆత్రేయ వంటి వారు బాలచందర్‌తో అన్నారు. కానీ, ఆయన మాత్రం తను కథగా ఏదైతే అనుకున్నాడో దాన్నే స్క్రీన్‌పై చూపించారు. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. చివరలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం సినిమాకి బాగా ప్లస్‌ అయింది. ఈ సినిమా ఇన్‌స్పిరేషన్‌తోనే మొదట ముంబాయిలోని జుహు బీచ్‌లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడిరది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోని 20 జంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. దీనిపై మానవ హక్కుల సంఘం, అభ్యుదయ సంఘాలు సీరియస్‌ అయ్యాయి. సినిమాను డైరెక్ట్‌ చేసిన కె.బాలచందర్‌ను ఆ సంఘాల సభ్యులు తీవ్రంగా విమర్శించారు. ‘మరోచరిత్ర’ 200 రోజుల ఫంక్షన్‌లో బాలచందర్‌ మాట్లాడుతూ తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఈ సినిమా తీయడమేనని అన్నారు. ఈ సినిమా తీసినందుకు ప్రతిరోజూ బాధపడుతున్నానని, తనని క్షమించమని బహిరంగంగా కోరారు. యూత్‌ని ప్రభావితం చేసే ఇలాంటి సినిమాలు ఇకపై చెయ్యను అని చెప్పారు. ఆ తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా 1992లో ‘వానమె ఎల్లే’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ‘అక్టోబర్‌ 2’ పేరుతో తెలుగులో విడుదలైంది. రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఐదుగురు యువతీయువకులు చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని తమకి ఉన్న సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఎలా విజయం సాధించారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.