Read more!

English | Telugu

అందరితోనూ గొడవపడే ఆ హీరోయిన్‌ జీవితంలో అన్నీ వివాదాలే.. అందరూ శత్రువులే!

సమాజంలో మంచి, చెడు ఉన్నట్టే.. సినీ పరిశ్రమలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఇక ఎప్పుడూ వివాదాలతోనే సహజీవనం చేసేవారూ ఉంటారు. అలాంటి వారి గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చడం వార్తల్లోకి ఎక్కడం అనేది వారికి సర్వసాధారణ విషయం. పాతతరం హీరోయిన్లలో అలాంటి మనస్తత్వం ఉన్న వారిలో జి.వరలక్ష్మీ ఒకరు. ఆమె జీవితమే వివాదాల మయం. తోటి నటీనటులతో, దర్శకనిర్మాతలతో దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం వంటి ఘటనలు ఆమె జీవితంలో కోకొల్లలు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం.

నటిగా జి.వరలక్ష్మీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆత్మవిశ్వాసం అనేది ఆమెకు మెండుగా ఉండేది. ఏ క్యారెక్టర్‌ పోషించినా అది స్పష్టంగా కనిపించేది. కొన్ని సినిమాల్లో శాంత స్వభావం ఉన్న క్యారెక్టర్లు చేసినా అహంకారం, దురుసుతనం ఉన్న క్యారెక్టర్స్‌లోనే ఆమె ఎక్కువగా రాణించింది. నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉండేది. ఎవ్వరినీ లెక్కచేసేది కాదు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్లే ఆమె జీవితం వివాదాస్పదంగా మారింది. అప్పటికే పెళ్లయిన నటుడు, దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావును పెళ్లి చేసుకోవడంలో, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రకాశరావును వదిలేసి పహిల్వాన్‌ అజిత్‌సింగ్‌ను పెళ్లి చేసుకోవడంలో ఆమె తొందరపాటు కనిపిస్తుంది. ప్రకాశరావు మొదటి భార్య కుమారుడు కె.రాఘవేంద్రరావు, తన కుమారుడికి కె.ఎస్‌.ప్రకాశ్‌ అని తన మొదటి భర్త పేరే పెట్టుకున్నారు వరలక్ష్మీ. కె.ఎస్‌.ప్రకాశ్‌ సినిమాటోగ్రాఫర్‌గా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు పనిచేశారు. 

వివాదాలు, గొడవలు కొనితెచ్చుకునే వరలక్ష్మీని ఆరోజుల్లో కొందరు రౌడీ వరలక్ష్మీ అని, పిచ్చి వరలక్ష్మీ అని పిలిచేవారు. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ద్రోహి’ చిత్రంలో కె.ఎస్‌.ప్రకాశరావు, వరలక్ష్మీ జంటగా నటించారు. లక్ష్మీరాజ్యం ఓ కీలక పాత్ర పోషించారు. ఆ నిర్మాణ సంస్థకు ప్రకాశరావు మేనేజింగ్‌ డైరెక్టర్‌. తను కంపెనీ ఓనర్‌ భార్యని అనే అహంభావం వరలక్ష్మీకి ఉండేది. అందుకే లక్ష్మీరాజ్యం మీద ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించేది. ఇది లక్ష్మీరాజ్యంకి నచ్చేది కాదు. వరలక్ష్మీకి అనుకూలంగా నడిచేది కాదు. దీంతో వరలక్ష్మీకి కోపం వచ్చేది. ఒకసారి ఆమెపై చెప్పుతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టడం మొదలు పెట్టింది. యూనిట్‌లోని వారు ఇద్దరినీ విడిపించారు. ఈ ఘటనతో కోపం వచ్చిన లక్ష్మీరాజ్యం ఆమెపై పోలీస్‌ కేసు పెట్టింది. ఇది తెలుసుకున్న సినీ పెద్దలు రంగంలోకి దిగి కేసు కోర్టు వరకు వెళ్ళకుండా ఇద్దరికీ రాజీ కుదిర్చారు. 

వరలక్ష్మీ దుందుడుకు మనస్తత్వాన్ని చెప్పే మరో ఘటన సావిత్రి విషయంలో జరిగింది. చెన్నయ్‌లో జ్యోతి సినిమా షూటింగ్‌ జరుగుతోంది. వరలక్ష్మీ, సావిత్రి ఈ సినిమాలో నటించారు. వరలక్ష్మీ మేకప్‌ రూమ్‌లో మేకప్‌ చేసుకుంటోంది. సావిత్రి మేకప్‌ పూర్తి చేసుకొని సెట్‌లో కూర్చున్నారు. ఆమెకు కాస్త దూరంగా తండ్రి వెంకటరామచౌదరి కూర్చున్నారు. ఈలోగా కెమెరామెన్‌ చంద్రన్‌ అక్కడికి వచ్చాడు. షాట్‌ రెడీ అవడంతో వరలక్ష్మీని తీసుకెళ్ళాలనుకున్నాడు. సావిత్రిని వెనుక నుంచి చూసి వరలక్ష్మీ అనుకొని ‘పని కంప్లీట్‌ అయితే రా..’ అంటూ సావిత్రి భుజం మీద చెయ్యి వేశాడు. ఒక్కసారిగా పైకి లేచిన సావిత్రి ‘కళ్లు కనిపించడం లేదా?’ అని కోపంగా అరిచింది. దానికి చంద్రన్‌ పొరపాటు జరిగింది.. సారీ అన్నాడు. దీంతో సావిత్రి శాంతించింది. కానీ, ఆమె తండ్రి మాత్రం ఊరుకోలేదు. చంద్రన్‌ని నాన్‌స్టాప్‌గా తిట్టడం మొదలుపెట్టాడు. పనిలో పనిగా వరలక్ష్మీని కూడా తిట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మీ  కోపంగా అక్కడికి వచ్చి చౌదరికి చెప్పు చూపిస్తూ తిట్టడం మొదలు పెట్టింది. తండ్రిని తిడుతున్నందుకు సావిత్రి కూడా వరలక్ష్మీని తిట్టింది. వీళ్ళ గొడవ చూసిన యూనిట్‌ సభ్యులు వారిద్దరినీ విడదీశారు. 

ఆ తర్వాత కొన్నిరోజులకు సావిత్రి కొత్త కారు కొన్నారు. వరలక్ష్మీ ఆ కొత్త కారు టైర్లను కోయించేసింది. ఆ తర్వాత అది చాలా పెద్ద గొడవగా మారింది. ఎప్పుడూ గొడవకు సిద్ధంగా ఉండే వరలక్ష్మీకి ఆడవారంటే పడేది కాదు. ఈ విషయాన్ని ఆమే చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పట్లో ఆమెకు అందరూ మగస్నేహితులే ఉండేవారు. కస్సుబుస్సులాడుతూ కయ్యానికి కాలు దువ్వేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే వరలక్ష్మీ అంటే ఎవరికీ నచ్చేది కాదు. అందుకే ఆమెకు స్నేహితులకంటే శత్రువులే ఎక్కుమంది ఉండేవారు.