Read more!

English | Telugu

మొదటి రెండు వారాలు కలెక్షన్స్‌ నిల్‌.. ఆ తర్వాత ఆస్కార్‌ రేంజ్‌ సినిమా అనే ప్రశంసలు!

డబ్బు గొప్పదా.. మానవత్వం గొప్పదా? ఒక ఘటన చూసిన తర్వాత ఓ కుర్రాడిలో వచ్చిన ఆలోచన ఇది. తను ప్రత్యక్షంగా చూసిన ఆ ఘటన అతన్ని కదిలించింది. అసలే రచయిత.. దానికితోడు హృదయాన్ని హత్తుకున్న ఘటన. తన ఆలోచనలని ఒక కథగా మలిచాడు. ఆ కథ పేరు ‘అంతిమయాత్ర’. ఆ కుర్రాడి పేరు మదన్‌. సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టైమ్‌లో ఈటీవీలో సీరియల్‌ కోసం కథ చెప్పడానికి ఈటీవీ ఆఫీస్‌కి వచ్చాడు. ఆ కథ వినేందుకు ఆ సంస్థలోని ఓ ప్రముఖ్య వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. కథ చెప్పడం మొదలుపెట్టాడు మదన్‌. ఒక వ్యక్తి చనిపోతాడు.. అదే మొదటి సీన్‌. అది విన్న ఆ వ్యక్తి.. ఈ కథతో ఎక్కువ ఎపిసోడ్స్‌ చెయ్యలేం అంటూ పదినిమిషాల్లోనే కథను రిజెక్ట్‌ చేశాడు. ఇదే కథను ఎంతో మందికి వినిపించాడు మదన్‌. కానీ, ఎక్కడా వర్కవుట్‌ అవ్వలేదు. 

చివరికి అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గరకి వెళ్ళి కథ వినిపించాడు. ఆయనకి బాగా నచ్చింది. వెంటనే అతన్ని ఊటీ పంపించారు. నెల రోజులు టైమ్‌ ఇచ్చి ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసుకొని రమ్మని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఫుల్‌ స్క్రిప్ట్‌తో వచ్చాడు మదన్‌. అప్పుడు చెన్నయ్‌ నుంచి కె.భాగ్యరాజాను పిలిపించారు అట్లూరి. ఎందుకంటే కథలపై ఆయనకు మంచి జడ్జిమెంట్‌ ఉంటుంది. మదన్‌ చెప్పిన కథ విని చలించిపోయాడు భాగ్యరాజా. తెలుగు, తమిళ భాషల్లో తానే డైరెక్ట్‌ చేస్తానని, హీరో కూడా తనేనని చెప్పాడు. అది అట్లూరికి నచ్చలేదు. ఈ సినిమాలో ఎవరు నటించాలి అనే విషయంలో ఆయనకు కొన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. విసు, దాసరి నారాయణరావు, మోహన్‌బాబు.. వీళ్ళలో ఎవరో ఒకరితో సినిమా చేస్తే బాగుంటుందనేది అట్లూరి ఆలోచన. వీరు కాకపోతే మరో ఆప్షన్‌ తీసుకోవాలి అనుకున్నారు. ఒక దశలో ప్రకాష్‌రాజ్‌ని అనుకున్నారు. కథ విన్న ప్రకాష్‌రాజ్‌.. సినిమా కంటే నవలగా అయితే బాగుంటుంది. ట్రై చెయ్యమని సలహా ఇచ్చారు. మదన్‌కి విసుగొచ్చేసింది. తన కథకు ఏ దారి దొరకడం లేదు అని బాధపడ్డాడు. చివరికి అతనికి ఒక దారి దొరికింది. మదన్‌ దగ్గర మంచి కథ ఉందని, వెంటనే దాని రైట్స్‌ తీసుకోమని దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ సోదరుడు చెప్పాడు. కథ వినకుండానే అట్లూరి పూర్ణచంద్రరావు దగ్గర నుంచి దాని రైట్స్‌ తీసుకున్నాడు. అప్పటికే ఆ కథపై నమ్మకంతో ఎన్నో ప్రయత్నాలు చేసిన అట్లూరి కూడా విసిగిపోయి చంద్రసిద్ధార్థ్‌ అడగ్గానే నో చెప్పకుండా రైట్స్‌ ఇచ్చేశారు. అయితే ఎందుకైనా మంచిది అని తమిళ రైట్స్‌ మాత్రం తనదగ్గరే ఉంచుకున్నారు. ఆ తర్వాత ఔట్‌లైన్‌గా కథ విన్నాడు చంద్ర. ఆ కథను సినిమాగా తీసేందుకు ప్రేమ్‌కుమార్‌ పట్రా ఓకే చెప్పారు. ఈ సినిమాలోని ప్రదాన పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో తర్జనభర్జలు పడిన తర్వాత రాజేంద్రప్రసాద్‌ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. 

రాజేంద్రప్రసాద్‌తో టైమ్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. మదన్‌ కథ చెబుతుంటే ఆయనతోపాటు చంద్రసిద్ధార్థ్‌ కూడా విన్నాడు. కథ పూర్తి కాగానే మారు మాట్లాడకుండా.. రాజేంద్రప్రసాద్‌ బెడ్‌రూమ్‌లోకి, చంద్రసిద్ధార్థ్‌ బాల్కనీలోకి వెళ్లిపోయారు. మదన్‌కి విషయం అర్థమైంది. ఇక ఈ కథ గురించి ఎవ్వరికీ చెప్పకూడదని డిసైడ్‌ అయ్యాడు. బెడ్‌రూమ్‌ నుంచి వచ్చిన రాజేంద్రప్రసాద్‌.. వెంటనే సినిమా స్టార్ట్‌ చేసెయ్యాలి.. ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు అన్నాడు కళ్లు తుడుచుకుంటూ. చంద్రసిద్ధార్థ్‌ పరిస్థితి కూడా అంతే ఉంది. 

టైటిల్‌ విషయానికి వస్తే.. అంతిమయాత్ర అనే టైటిల్‌ చంద్రసిద్ధార్థ్‌కి నచ్చలేదు. అతని మనసులో ఆ నలుగురు అనే టైటిల్‌ ఎప్పటి నుంచో ఉంది. మదన్‌ కూడా అదే అనుకున్నాడు. ఫైనల్‌ ‘ఆ నలుగురు’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసుకున్నారు. ఈ టైటిల్‌ గురించి తెలుసుకున్న చంద్రసిద్ధార్థ్‌ తండ్రి.. టైటిల్‌ చాలా బాగుందని, ఈ సినిమా నీ కెరీర్‌ని టర్న్‌ చేస్తుందని చెప్పారు. తప్పకుండా సినిమా చూస్తానని అన్నారు. సినిమాలంటే ఇష్టపడని తండ్రి నుంచి ఆశీర్వాదం రావడంతో చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాడు చంద్ర. అలా సినిమా మొదలైంది. కోటి పాతిక లక్షల బడ్జెట్‌తో 38 రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తి చేశారు. ఎడిటింగ్‌లో బిజీగా ఉన్నాడు చంద్ర. శవ యాత్ర సీన్‌ను ఎడిట్‌ చేస్తున్నారు. అప్పుడు ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది.. తండ్రి చనిపోయారని. ఆయన తన సినిమా చూడకుండానే వెళ్లిపోయారు. వెంటనే ఊరికి బయల్దేరాడు చంద్ర. ఆ తర్వాత కొన్ని రోజులకు డిసెంబర్‌ 9, 2004లో ‘ఆ నలుగురు’ రిలీజ్‌ అయింది. 

టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా రిజల్ట్‌ కూడా ఉంది. 27 ప్రింట్లతో రిలీజ్‌ చేస్తే 16 ప్రింట్లు రిటర్న్‌ వచ్చేశాయి. మొదటి రెండు వారాలు కలెక్షన్లు నిల్‌. మూడో వారం మొదటి రోజు అందరూ షాక్‌ అయ్యారు. మార్నింగ్‌ షో నుంచి సెకండ్‌ షో వరకు ఫుల్స్‌ అయ్యాయి. అలా రోజు రోజుకీ థియేటర్లు పెరుగుతూ వెళ్ళాయి. సినిమా చూసిన వాళ్ళంతా యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ సినిమాను థియేటర్‌లో చూసినవారి కంటే టీవీలో చూసినవారే ఎక్కువ. ‘ఆ నలుగురు’ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. ఉత్తమ నటుడుగా రాజేంద్రప్రసాద్‌, ఉత్తమ సహాయ నటుడిగా కోట శ్రీనివాసరావు నందులు అందుకున్నారు. ఈ సినిమా మరాఠీలో షాయాజీ షిండే రీమేక్‌ చేశారు. కన్నడలో విష్ణువర్థన్‌ సిరివంత పేరుతో రీమేక్‌ చేశారు.