Read more!

English | Telugu

అమితాబ్‌తో అమేజింగ్ జ‌ర్నీ స్టార్ట్ చేసిన ర‌ష్మిక‌!

 

ర‌ష్మికా మంద‌న్న జోరు ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా రాణిస్తోన్న ఆమె లేటెస్ట్‌గా 'సుల్తాన్' మూవీతో కోలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికే మాతృభాష‌కు చెందిన క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో టాప్ యాక్ట్రెస్ అయిన ర‌ష్మిక త్వ‌ర‌లో 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. అందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరో. ఆ సినిమా ఇటీవ‌లే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇంత‌లోనే మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క హిందీ చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది ర‌ష్మిక‌. ఏకంగా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

అవును. వికాస్ బెహ‌ల్ డైరెక్ట్ చేస్తున్న 'గుడ్‌బై'లో ఆమె న‌టిస్తోంది. ఇందులో అమితాబ్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ఏక్తా క‌పూర్‌కు చెందిన బాలాజీ టెలీ ఫిలిమ్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. శుక్ర‌వార‌మే ముంబైలో ఈ సినిమా ముహూర్త‌పు షాట్‌ను చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'గుడ్‌బై' క్లాప్ బోర్డ్ పిక్చ‌ర్‌ను షేర్ చేసింది ర‌ష్మిక‌. దాంతో పాటు, "ప‌ర్ఫార్మెన్స్‌కు అవ‌కాశం ఉంటే నాకు న‌చ్చుతుంది. ఇది అలాంటి ఒక ప్రాజెక్ట్‌. ఈ అమేజింగ్ జ‌ర్నీలో భాగం కావ‌డం థ్రిల్లింగ్‌గా ఉంది. #Goodbye ." అని రాసుకొచ్చింది.

ర‌ష్మిక శుక్ర‌వార‌మే ఈ సినిమా సెట్స్ మీద‌కు అడుగుపెట్ట‌గా, అమితాబ్ ఏప్రిల్ 4న షూటింగ్‌లో జాయిన‌వుతారు. వికాస్ బెహ‌ల్‌‌, ఏక్తా క‌పూర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన 'లూటేరా', 'ఉడ్తా పంజాబ్' సినిమాలు ఇటు బాక్సాఫీస్ స‌క్సెస్ కావ‌డ‌మే కాకుండా, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అమితంగా పొందాయి.

"ఎమోష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ‌పాళ్ల‌లో ఉన్న అత్యంత స్పెష‌ల్ స‌బ్జెక్ట్ 'గుడ్‌బై'. ప్ర‌తి కుటుంబం త‌మ‌ను తాము చూసుకొనే క‌థ ఇది. ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌తో ప‌నిచేయ‌డం చాలా సంతోషంగానూ, ర‌ష్మిక మంద‌న్న‌ను ప్రెజెంట్ చేస్తున్నందుకు థ్రిల్లింగ్‌గానూ ఉంది." అని చెప్పారు ఏక్తా క‌పూర్‌.