English | Telugu
డ్రగ్స్ కేస్.. హైదరాబాద్‌లో సుశాంత్‌సింగ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ అరెస్ట్!
Updated : May 28, 2021
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ రూమ్మేట్ సిద్ధార్థ్ పితానీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. సుమారు ఏడాది క్రితం ముంబైలో సుశాంత్ తన ఫ్లాట్‌లో చనిపోయాడు. అప్పట్నుంచీ పలు ఏజెన్సీలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. 2020 జూన్ 14న తన రూమ్‌లో ఉరివేసుకొని ఉన్న సుశాంత్‌ను కనుగొన్నారు. ఆ టైమ్‌లో ఆయన ఫ్లాట్‌లో ఉన్న నలుగురు వ్యక్తుల్లో సిద్ధార్థ్ పితానీ ఒకడు. హైదరాబాద్‌లోఓ అతడ్ని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు ఈరోజు ముంబైకి తీసుకు వెళ్లారు. అతడికి కోర్టు జూన్ 1 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది.
అనేక నోటీసులు ఇచ్చినా, అతను రాకపోవడంతో ఒక పోలీస్ బృందం అతడి కోసం వెతుకుతూ వచ్చింది. హైదరాబాద్‌లోని అతని నివాసంలో కొన్ని డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లభ్యమయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన సుశాంత్ మృతికి సంబంధించి సిద్ధార్థ్‌ను గత ఏడాది ముంబై పోలీసులు, సీబీఐ పలుమార్లు ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా మొదలైన డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ 34 మందిపై చార్జిషీట్ దాఖలైంది. వారిలో సుశాంత్ సింగ్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు.
ఐటీ ప్రొఫెషనల్ అయిన సిద్ధార్థ్ పలు న్యూస్ చానళ్లతో మాట్లాడుతూ, సుశాంత్‌సింగ్ చివరి క్షణాల గురించి వెల్లడించడంతో, అతని వెర్షన్‌పై పలు ఏజెన్సీలు అతనిని నిశితంగా ప్రశ్నించాయి. సీబీఐ అయితే గత సెప్టెంబర్‌లో దాదాపు అరడజను సార్లు అతడిని ఇంటరాగేట్ చేసింది.
