English | Telugu
సుశాంత్ తొలి వర్థంతి.. ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
Updated : Jun 13, 2021
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నేటికి(జూన్ 14) ఏడాది పూర్తయ్యింది. సుశాంత్ తొలి వర్థంతి సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. గత ఏడాది జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు సుశాంత్. అప్పట్లో ఆయన మృతి సంచలనంగా మారింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మొదట్లో సుశాంత్ ది ఆత్మహత్య అంటూ రిపోర్టులు వచ్చాయి. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ పలు అనుమాలతో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. దీని వెనుక బాలీవుడ్ బడాబాబులు, డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ముంబై పోలీస్, బిహార్ పోలీస్, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్నాయి.
సుశాంత్ జనవరి21, 1986లో బీహార్ రాష్ట్రం పాట్నాలో జన్మించాడు. సుశాంత్ కు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉండేది. అదే సుశాంత్ ను సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేసింది. కెరీర్ తొలినాళ్లలో పలు టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేసిన సుశాంత్.. ఆ తర్వాత ‘కై పోచే’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, డిటెక్టివ్ బ్యోమ్‌కేశ్ భక్షి వంటి చిత్రాలు సుశాంత్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని జీవిత కథపై తీసిన ‘ఎం.ఎస్.ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీ' మూవీ సుశాంత్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే చిచోరే మూవీ కూడా సుశాంత్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తక్కువ టైంలోనే బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుశాంత్ 34 ఏళ్ళకే అర్థాంతరంగా మృతి చెందడం సంచలనంగా మారింది.
బాలీవుడ్ మాఫియానే సుశాంత్ ని పొట్టన పెట్టుకుందని ఆయన అభిమానులు అంటున్నారు. దీనికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతున్నారు. త్వరలోనే సుశాంత్ డెత్ మిస్టరీ వీడాలని ఆశిద్దాం.