Read more!

English | Telugu

అతని ట్రాప్ లో పడొద్దు.. అతను నన్ను వేధిస్తున్నాడు!

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యేందుకు అంగీకరించి, 37 అడ్వాన్స్ తీసుకున్న సోనాక్షి.. ఆ ఈవెంట్ కి హాజరు కాకపోగా, తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణకు సోనాక్షి డుమ్మా కొడుతుండడంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన సోనాక్షి ఆ వార్తలను కొట్టేపడేసింది.

నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ వార్తలపై తాజాగా సోనాక్షి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఇది పూర్తిగా కల్పితమని తెలిపింది. "ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. అన్ని మీడియా హౌస్ లు, జర్నలిస్టులకు నా రిక్వెస్ట్ ఏమిటంటే.. ఈ ఫేక్ న్యూస్ ని ప్రసారం చేయవద్దు. సదరు వ్యక్తి పబ్లిసిటీ కోసం, అలాగే నా నుంచి డబ్బు రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే" అంటూ సోనాక్షి చెప్పుకొచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణం కట్ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షికు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. 2019లో ఢిల్లీలో ఒక ఈవెంట్ ప్లాన్ చేసిన ప్రమోద్ శర్మ.. దానికి ముఖ్య అతిథిగా సోనాక్షిని ఆహ్వానించాడు. కానీ, ఆమె ఆ కార్యక్రమానికి హాజరు కాకపోగా, తాను ఇచ్చిన రూ.37 లక్షలు తనకు తిరిగి ఇవ్వడంలేదని ఆరోపిస్తూ సోనాక్షిపై ప్రమోద్ కేసు నమోదు చేశాడు.