English | Telugu

శ్రావ‌ణ్ చివ‌రి చూపుకు నోచుకోలేకపోయిన భార్య‌, కుమారుడు!

ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల ద్వ‌యం న‌దీమ్‌-శ్రావ‌ణ్‌లో ఒక‌రైన శ్రావ‌ణ్ రాథోడ్ (66) కొవిడ్‌-19తో పోరాడుతూ గురువారం రాత్రి మృతి చెందిన విష‌యం తెలిసిందే. ముంబైలోని ర‌హేజా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఆయ‌న తుదిశ్వాస విడిచార‌నే వార్త‌తో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంతా షాక్‌కు గురైంది. కొవిడ్ బారిన ప‌డ‌క ముందే శ్రావ‌ణ్ డ‌యాబెటిక్ షేషెంట్ అనీ, ఆయ‌నకు గుండె సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌నీ ఆయ‌న స్నేహితుడు, పాపుల‌ర్ గేయ‌ర‌చ‌యిత స‌మీర్ తెలిపారు.

ఇక్కడ‌ మ‌రింత విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమంటే శ్రావ‌ణ్ భార్య, పెద్ద కుమారుడు ఆయ‌న చివ‌రి చూపుకు కూడా నోచుకోలేక‌పోవ‌డం. దీనికి కార‌ణం.. ఆ ఇద్ద‌రూ కూడా కొవిడ్‌తో బాధ‌ప‌డుతూ అంధేరీ ఈస్ట్‌లోని సెవ‌న్ హిల్స్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతుండ‌టం.

1990ల కాలంలో న‌దీమ్‌-శ్రావ‌ణ్ బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. అనంత‌ర కాలంలో క్లాసిక్‌గా పేరు తెర్చుకున్న 'ఆషిఖీ' సినిమా వారిని టాప్ పొజిష‌న్‌లో నిలిపింది. సాజ‌న్‌, ఫూల్ ఔర్ కాంటే, స‌డ‌క్‌, దీవానా, దామిని, హ‌మ్ హై రాహీ ప్యార్ కే, దిల్‌వాలే, బ‌ర్సాత్‌, రాజా, రాజా హిందుస్తానీ, ప‌ర్‌దేశ్‌, ధ‌డ్క‌న్‌, రాజ్‌.. ఇట్లా ఎన్ని మ్యూజిక‌ల్ హిట్స్ అందించారో! అలాగే ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. 2000ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన 'డు నాట్ డిస్టర్బ్' మూవీకి కలిసి పని చేశారు.