English | Telugu

'వార్-2'లో షారుఖ్ ఖాన్!

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న 'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారిక ప్రకటన కూడా రాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ బిగ్ స్టార్, నార్త్ బిగ్ స్టార్ కలిసి నటిస్తున్న ఈ సినిమా అససిసలు పాన్ ఇండియా సినిమా అవుతుందని, దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ స్టార్స్ కి తోడు మరో బిగ్ స్టార్ చేతులు కలపబోతున్నారని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు షారుఖ్ ఖాన్.

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ యూనివర్స్ లో భాగంగా 'ఏ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్' సినిమాలు రాగా అన్నీ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా 'పఠాన్' చిత్రం వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దాంతో ఈ యూనివర్స్ సినిమాల పట్ల క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం 'టైగర్-3' షూటింగ్ దశలో ఉంది. 'వార్-2' ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కనుంది. షారుఖ్ ఖాన్ 'పఠాన్'లో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సల్మాన్ ఖాన్ 'టైగర్-3'లో షారుఖ్ ఖాన్ మెరవనున్నారు. ఇలా ఈ స్పై యూనివర్స్ లో ఒక హీరో మరో హీరోల సినిమాలలో సందడి చేయడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో 'వార్-2'లో సైతం షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని వినికిడి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్న ఎన్టీఆర్ నవంబర్ లోపు ఈ షూటింగ్ పూర్తి చేసి, ఆ వెంటనే 'వార్-2' సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.