English | Telugu

షారుక్ సినిమాలో 'దంగ‌ల్' తార‌?

`రాజా రాణి`, `తెరి`, `మెర్సాల్‌`, `బిగిల్`.. ఇలా వ‌రుస విజ‌యాల‌తో త‌మిళ‌నాట స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు అట్లీ. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ కెప్టెన్.. హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ బాట ప‌డుతున్నాడు. అక్క‌డ ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో త‌న మొద‌టి హిందీ సినిమా చేయ‌బోతున్నాడు. అంతేకాదు.. త‌న గ‌త మూడు చిత్రాల త‌ర‌హాలోనే ఇది కూడా మాస్ మ‌సాలా మూవీగానే తెర‌కెక్క‌నుంద‌ని టాక్.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంతో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బాలీవుడ్ డెబ్యూ ఇవ్వ‌బోతోంద‌ని.. షారుక్ కి జంట‌గా ఆమె క‌నిపిస్తుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వినిపించాయి. కాగా, ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ఆమిర్ ఖాన్ సెన్సేష‌న‌ల్ మూవీ `దంగ‌ల్`లో న‌టించిన సాన్యా మ‌ల్హోత్రాని ఎంపిక‌చేశార‌ని వినికిడి. న‌య‌న్ తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో సాన్యా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే షారుక్ - అట్లీ సినిమాలో సాన్యా ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.

ప్ర‌స్తుతం షారుక్.. `ప‌ఠాన్` మూవీ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో `రా` ఏజెంట్ గా న‌టిస్తున్నారు షారుక్. అలాగే `బ్ర‌హ్మాస్త్ర‌`, `లాల్ సింగ్ చ‌డ్ఢా` చిత్రాల్లో అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అదే విధంగా రాజ్ కుమార్ హిరాణి ద‌ర్శ‌క‌త్వంలోనూ షారుక్ హీరోగా ఓ సినిమా రూపొంద‌నుంది.