English | Telugu

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. సంజ‌య్ ద‌త్ కెరీర్‌లో టాప్ టెన్ మూవీస్‌!

నేడు సంజ‌య్ ద‌త్ 62వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త్వ‌ర‌లో విల‌న్ అధీర రోల్‌లో 'కేజీఎఫ్: చాప్ట‌ర్ 2'లో మ‌న‌ల్ని ఆక‌ట్టుకోవ‌డానికి వ‌స్తున్న ఆయ‌నకు దేశ‌వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచీ ఇప్ప‌టివ‌ర‌కూ త‌న కెరీర్‌లో బాలీవుడ్ గ్రేటెస్ట్ మూవీస్ అన‌ద‌గ్గ కొన్ని సినిమాల్లో ఆయ‌న చేసిన పాత్ర‌ల‌ను అంత త్వ‌ర‌గా మ‌నం మ‌ర‌చిపోలేం. అలా ఆయ‌న చేసిన 10 బెస్ట్ రోల్స్‌ను ఓసారి గుర్తు చేసుకుందాం.

ఖ‌ల్‌నాయ‌క్‌
సంజ‌య్ ద‌త్ చేసిన గొప్ప సినిమాల లిస్టులోంచి 'ఖ‌ల్‌నాయ‌క్‌'ను తీసేయ‌డం అసాధ్యం. టైటిల్ రోల్‌లో సంజ‌య్ చేసిన న‌ట‌నకు ఆడియెన్స్ దాసోహ‌మ‌య్యారు. టైటిల్ సాంగ్‌ను కానీ, ఆ సాంగ్‌లో సంజ‌య్ హావ‌భావాలు కానీ అంత త్వ‌ర‌గా మ‌నం మ‌ర‌చిపోలేం. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల‌ను నేటి కాలానికి లెక్క‌క‌డితే రూ. 160 కోట్ల‌కు పైగా తేలుతుంది.

వాస్త‌వ్‌
సంజ‌య్ నోటి నుంచి వ‌చ్చిన 'ప‌చాస్ తోలా సోనా' డైలాగ్ సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. ఆయ‌న చేసిన ఐకానిక్ క్యారెక్ట‌ర్స్‌లో ఈ సినిమాలోని క్యారెక్ట‌ర్ క‌చ్చితంగా ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్టుల‌కు ఈ క్యారెక్ట‌ర్ ఓ ఫీస్ట్. అంత‌లా త‌న ప‌ర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌ను అల‌రించాడు సంజ‌య్‌.

మున్నాభాయ్ ఎంబీబీఎస్‌
'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ప్ర‌స్తావ‌న లేకుండా సంజ‌య్ ద‌త్ సినిమాల లిస్టు పూర్త‌వ‌దు. ఆయ‌న కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలిచిన సినిమా ఇది. సుదీర్ఘ కాలం త‌ర్వాత సంజ‌య్ చేసిన ఔట్ అండ్ ఔట్ కామెడీ రోల్ మున్నాభాయ్‌. ఇందులో తండ్రి సునీల్ ద‌త్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సంజ‌య్‌. ఇప్ప‌టికీ ఈ సినిమా చూస్తుంటే ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా న‌వ్విస్తూనే ఉంటుంది.

సాజ‌న్‌
సంజ‌య్ కెరీర్‌లో పాత‌బ‌డ‌ని సినిమాల్లో 1991లో వ‌చ్చిన 'సాజ‌న్' ఒక‌టి. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే ఈ సినిమాలో సంజ‌య్ ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం సూప‌ర్బ్‌. రొమాంటిక్ డ్రామాల‌కు స‌రిగ్గా స‌రిపోతాడ‌ని నిరూపించిన క్యారెక్ట‌ర్‌ను ఈ సినిమాలో పోషించాడు. స‌బ్జెక్ట్ ప‌రంగా కానీ, క్యారెక్ట‌ర్ ప‌రంగా కానీ సంజ‌య్ కెరీర్‌లో బాగా చెప్పుకొనే సినిమా 'సాజ‌న్‌'.

హ‌సీనా మాన్ జాయేగీ
'మున్నాభాయ్' సిరీస్ రాక ముందు సంజ‌య్ ద‌త్‌ను అరుదైన కామిక్ రోల్‌లో చూపించిన మూవీ 'హ‌సీనా మాన్ జాయేగీ'. కామెడీ చేయ‌డంలో నిష్ణాతునిగా పేరున్న గోవిందాతో, ఇత‌ర న‌టుల‌తో క‌లిసి ఆయ‌న పండించిన హాస్యాన్ని అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేం. కాలానికి త‌ట్టుకొని టైమ్‌లెస్ క్లాసిక్‌గా నిల‌బ‌డింది ఈ సినిమా.

స‌డ‌క్‌
బాక్సాఫీస్ వండ‌ర్‌గా హిస్ట‌రీ సృష్టించింది 'స‌డ‌క్‌'. అంత‌దాకా సంజ‌య్‌లోని న‌టుడ్ని ఈ త‌ర‌హా కోణంలో మ‌నం చూడ‌లేదు. ఒక అమ్మాయి ప్రేమ‌లో ప‌డి, ఆ ప్రేమ‌ను ర‌క్షించుకోడానికి ఎంత‌టి సాహ‌సానికైనా సిద్ధ‌ప‌డే టాక్సీ డ్రైవ‌ర్ క్యారెక్ట‌ర్‌లో సంజ‌య్ ఇచ్చిన ప‌ర్ఫార్మెన్స్ ఆయ‌న ఫ్యాన్ బేస్‌ను అమితంగా పెంచింది. సంజ‌య్‌కు ఆడియెన్స్‌లో పిచ్చి క్రేజ్ తెచ్చిన సినిమాగా 'స‌డ‌క్' పేరు తెచ్చుకుంది.

అగ్నీప‌థ్‌
అదే పేరుతో ఇదివ‌ర‌కు వ‌చ్చి ఘ‌న‌విజ‌యం సాధించిన సినిమాకు రీమేక్‌గా త‌యారైన 'అగ్నీప‌థ్‌'లో 'కాంచ‌చీనా' అనే విల‌న్ రోల్‌లో సంజ‌య్ చెల‌రేగిన తీరు ఆ రోజుల్లో టాక్ ఆఫ్ ద టౌన్‌. ఈ పాత్ర‌లో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన అభిన‌యంతో బాలీవుడ్‌లోని మోస్ట్ ఫేమ‌స్ విల‌న్స్‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు సంజ‌య్‌. ఈ మూవీని మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా చేసిన అంశాల్లో సంజ‌య్ ప‌ర్ఫార్మెన్స్‌దే అగ్ర స్థానం.

రాకీ
న‌టుడిగా సంజ‌య్ ద‌త్‌కు జ‌న్మ‌నిచ్చిందీ, భ‌విష్య‌త్ స్టార్‌ను ప‌రిచ‌యం చేసిందీ 'రాకీ' సినిమా. అనేక‌మంది పేరుపొందిన న‌టీన‌టులు న‌టించిన ఈ సినిమాలో సంజ‌య్ న‌ట‌న సైతం ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. తొలి సినిమాతోటే ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర‌వేయ‌డ‌మే కాకుండా, ప‌రిచ‌య‌మైన సినిమాతోటే పెద్ద హిట్ సాధించిన న‌టుడిగా గుర్తింపు పొందాడు.

మిష‌న్ క‌శ్మీర్‌
న‌టునిగా సంజ‌య్ ద‌త్‌ను శిఖ‌రాగ్రాన నిలిపిన సినిమాల్లో 'మిష‌న్ క‌శ్మీర్' ఒక‌టి. అంతే కాదు.. అనేక అవార్డుల‌ను కూడా ఇది సాధించిపెట్టింది. బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒక‌టిగా నిలిచిన ఈ సినిమా క‌థ కానీ, పాత్ర‌ల చిత్ర‌ణ కానీ, క‌థ‌నం కానీ.. ఎక్క‌డా లోప‌మ‌నేది లేకుండా ఆక‌ట్టుకున్నాయి.

ల‌గే ర‌హో మున్నాభాయ్‌
'మున్నాభాయ్ ఎంబీబీఎస్' త‌ర్వాత దానికి సీక్వెల్ కోరుకున్న ఫ్యాన్స్‌ను ఆనందింప‌జేస్తూ వ‌చ్చిన ఈ సీక్వెల్ సైతం ఒరిజిన‌ల్ అంత హిట్ట‌వ‌డ‌మే కాకుండా, థీమ్ ప‌రంగా ఆడియెన్స్‌పై ప్ర‌గాఢ‌మైన ముద్ర వేసింది. ప్రేక్ష‌కులు అత్యంత ప్రేమించే సంజ‌య్ పాత్ర‌ల్లో మున్నాభాయ్ ఒక‌టి. ఆద్యంతం హాస్యాన్ని పంచ‌డ‌మే కాకుండా గాంధీగిరి అనే కొత్త ప‌దాన్ని సృష్టించిన ఈ సినిమాకు మ‌రో సీక్వెల్ కావాల‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారంటే.. దాని ప్ర‌భావం అలాంటిది.