English | Telugu

'రెడ్' హిందీ రీమేక్‌లో ఆదిత్య‌రాయ్ క‌పూర్‌

చివ‌ర‌గా 'మ‌లంగ్' మూవీలో హీరోగా క‌నిపించిన ఆదిత్య‌రాయ్ క‌పూర్ త‌మిళ హిట్ ఫిల్మ్ 'తాడ‌మ్' హిందీ రీమేక్‌లో హీరోగా న‌టించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ రీమేక్‌ను భూష‌ణ్ కుమార్‌, మురాద్ ఖేతాని సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. సెప్టెంబ‌ర్‌లో షూటింగ్ మొద‌ల‌య్యే ఈ ఫిల్మ్ ద్వారా వ‌ర్ధ‌న్ కేట్క‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

ఇదివ‌ర‌కు 'తాడ‌మ్' హిందీ రీమేక్‌లో హీరోగా చేయ‌డానికి సిద్ధార్థ్ మ‌ల్హోత్రా అంగీక‌రించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో లీడ్ రోల్‌ను ఆదిత్య‌రాయ్ క‌పూర్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ మార్పుకు కార‌ణాలు తెలియ‌లేదు. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను నిర్మాత‌లు వెల్ల‌డించ‌లేదు. నిజ జీవిత ఘ‌ట‌నల ఆధారంగా త‌యారుచేసిన క‌థ‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ది.

మ‌గిళ్ తిరుమేని డైరెక్ట్ చేసిన 'తాడ‌మ్' 2019 మార్చిలో విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆ మూవీలో అరుణ్ విజ‌య్‌, తాన్యా హోప్‌, స్మృతి వెంక‌ట్‌, విద్యా ప్ర‌దీప్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఒక హీరోయిన్ హ‌త్య చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. పోలీసులో ఓ యువ‌కుడ్ని అనుమానిస్తారు. అయితే అచ్చు గుద్దిన‌ట్లు అలాగే ఉన్న మ‌రో యువ‌కుడు సీన్‌లోకి రావ‌డంతో క‌న్‌ఫ్యూజ‌న్ ఏర్ప‌డుతుంది.

తెలుగులో ఇది 'రెడ్‌'గా రీమేక్ అయ్యింది. క‌వ‌ల సోద‌రులుగా రామ్ డ్యూయ‌ల్ రోల్ చేసిన ఈ మూవీలో నివేదా పేతురాజ్‌, మాళ‌వికా శ‌ర్మ‌, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. కిశోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్‌గా ఆడింది.