Read more!

English | Telugu

హిందీలో డ‌బ్ అయిన సౌత్ సినిమాల్లో 'RRR'ది థ‌ర్డ్ ప్లేస్‌!

 

ద‌క్షిణాదిలో నిర్మాణ‌మై హిందీలో విడుద‌లైన సినిమాల్లో మొద‌టి వారం క‌లెక్ష‌న్ల ప‌రంగా 'RRR' మూడో స్థానంలో నిలిచింది. రాజ‌మౌళి డైరెక్ట్ చేయ‌గా, రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టించిన 'RRR' మూవీ హిందీ వెర్ష‌న్ తొలి వారం రూ. 132.59 కోట్ల (నెట్‌)ను వ‌సూలు చేసింది. గురువారం ఏడో రోజు ఈ సినిమాకు రూ. 12 కోట్లు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే హిందీ బెల్ట్‌లోనే 'RRR'కు ప్ర‌స్తుతం అధిక ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తోంది.

క‌రోనా అనంత‌ర కాలంలో విడుద‌లైన అన్ని హిందీ సినిమాల్లోనూ తొలివారం వ‌సూళ్ల‌లో 'RRR'దే పైచేయి. అక్ష‌య్ కుమార్ సినిమా 'సూర్య‌వంశీ' ఇదే కాలానికి రూ. 120.66 కోట్లు, 'ద క‌శ్మీర్ ఫైల్స్' రూ. 97.30 కోట్లు, ర‌ణ‌వీర్ సింగ్ మూవీ '83' రూ. 71.87 కోట్లు, ఆలియా భ‌ట్ సినిమా 'గంగూబాయ్ క‌థియ‌వాడి' రూ. 68.93 కోట్లు వ‌సూలు చేశాయి. 'RRR' శుక్ర‌వారం రూ. 20.07 కోట్లు, శ‌నివారం రూ. 24 కోట్లు, ఆదివారం రూ. 31.50 కోట్లు, సోమ‌వారం రూ. 17 కోట్లు, మంగ‌ళ‌వారం రూ. 15.02 కోట్లు, బుధ‌వారం రూ. 13 కోట్లు, గురువారం రూ. 12 కోట్ల‌ను వ‌సూలు చేసింది. మాస్ ఏరియాల్లో ఈ సినిమాను ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రిస్తున్నారు.

ఇక హిందీలో విడుద‌లైన ద‌క్షిణ భార‌త సినిమాల విష‌యానికి వ‌స్తే.. రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన మునుప‌టి సినిమా 'బాహుబ‌లి 2' హిందీ వెర్ష‌న్‌ తొలివారం రూ. 247 కోట్ల‌ను వ‌సూలు చేయ‌గా, శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ర‌జ‌నీకాంత్ న‌టించిన '2.0' మూవీ రూ. 133 కోట్ల‌ను రాబ‌ట్టింది. వాటి త‌ర్వాత 'RRR' రూ. 132.59 కోట్ల‌తో మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది.