English | Telugu
హిందీలో 100 కోట్ల మార్కును దాటిన 'ఆర్ఆర్ఆర్'!
Updated : Mar 30, 2022
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ 'ఆర్ఆర్ఆర్' హిందీలోనూ అఖండ విజయం సాధించింది. విడుదలైన ఐదు రోజులకే రూ. 100 కోట్ల మార్కును దాటి, రూ. 200 కోట్ల లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్ ఐదో రోజు మంగళవారం రూ. 15.02 కోట్ల నెట్‌ను సాధించింది. దీంతో హిందీ 'ఆర్ఆర్ఆర్' వసూళ్లు రూ. 107.59 కోట్లకు చేరుకున్నాయి.
నార్త్‌లోని మాస్ బెల్ట్‌లో సూపర్బ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా రాజమౌళి ఫస్ట్ బ్లాక్‌బస్టర్ 'బాహుబలి' (హిందీ) వసూళ్లను తొలి వారమే దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం రూ. 20.07 కోట్లు, శనివారం రూ. 24 కోట్లు, ఆదివారం రూ. 31.50 కోట్లు, సోమవారం రూ. 17 కోట్లు, మంగళవారం 15.02 కోట్లను 'ఆర్ఆర్ఆర్' రాబట్టింది. 'బాహుబలి: ద బిగినింగ్' హిందీ వెర్షన్ రూ. 118.70 కోట్లను వసూలు చేసింది. ఈ మార్కును దాటేందుకు 'ఆర్ఆర్ఆర్'కు మరో రూ. 11.11 కోట్లు వస్తే చాలు. బుధవారమే ఈ వసూళ్లు వచ్చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా ఆలియా భట్ నటన ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తోంది. రామరాజు తండ్రి వెంకట్రామరాజుగా కనిపించేది 10 నిమిషాల సేపే అయినా అజయ్ దేవ్‌గణ్ అభినయం హిందీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది.