Read more!

English | Telugu

కంగ‌న లాంటి విల‌క్ష‌ణ న‌టి వ‌ర‌ల్డ్‌లోనే లేదు!

 

సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాలను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు వెల్ల‌డించ‌డంలో రామ్‌గోపాల్ వ‌ర్మ‌, కంగ‌నా ర‌నౌత్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఏమాత్రం ఫిల్ట‌ర్ లేకుండా ముక్కుసూటిగా త‌న ఒపీనియ‌న్స్‌ను ట్వీట్ చేస్తుంటారు ఆర్జీవీ. అలాంటి ఆయ‌న లేటెస్ట్‌గా ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌కు క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. కంగ‌న టైటిల్ రోల్ పోషిస్తోన్న 'త‌లైవి' ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 

త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా, "హే కంగ‌నా.. కొన్ని విష‌యాల్లో నేను మీతో వ్య‌తిరేకిస్తాను. కానీ సూప‌ర్ డూప‌ర్ స్పెష‌ల్‌ 'త‌లైవి' ట్రైల‌ర్ చూశాక మైండ్‌బ్లోయింగ్ అనిపించింది. మీకు సెల్యూల్ చేయాల‌నుకుంటున్నా. స్వ‌ర్గం నుంచి జ‌య‌ల‌లిత క‌చ్చితంగా థ్రిల్ ఫీల‌వుతుంటారు." అని రాసుకొచ్చారు.‌

ఈ ట్వీట్‌కు కంగ‌న రిప్లై ఇచ్చింది. "హే స‌ర్‌.. ఏ విష‌యంలోనూ నేను మీతో వ్య‌తిరేకించ‌ను. మీరంటే నాకిష్టం, మిమ్మ‌ల్ని మెచ్చుకుంటాను. ఇగోలు, గ‌ర్వాలు చాలా ఈజీగా హ‌ర్ట‌య్యే ఈ విప‌రీత‌మైన సీరియ‌స్ ప్ర‌పంచంలో నేను మిమ్మ‌ల్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే, మీతో స‌హా మీరు దేన్నీ సీరియ‌స్‌గా తీసుకోరు. కాంప్లిమెంట్స్‌కు థాంక్ యూ." అని ఆమె ట్వీట్ చేసింది.

ఆమె రిప్లైకు ప్ర‌తిస్పందించారు ఆర్జీవీ. "మంచిది కంగ‌నా.. స్ట్రాంగ్ ఒపీనియ‌న్స్‌తో ఉండేవాళ్లెవ‌రైనా తీవ్ర‌మైన రియాక్ష‌న్స్‌కు గుర‌వుతుంటారు. హాలీవుడ్‌కు చెందిన గొప్ప యాక్ట‌ర్ల‌తో మిమ్మ‌ల్ని కంపేర్ చేసిన‌ప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నార‌ని నేను ఫీల‌య్యాను. కానీ ఇప్పుడు నేను అపాల‌జీ చెప్తున్నాను. అంతే కాదు, మీ లాంటి వెర్స‌టాలిటీ ఉన్న మ‌రో న‌టి ఈ వ‌ర‌ల్డ్‌లోనే లేద‌నే విష‌యాన్ని 100 శాతం అంగీక‌రిస్తాను." అని రాశారు. 

ఈ ఇద్ద‌రి ట్వీట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా రూపొందుతోన్న 'త‌లైవి' ఏప్రిల్ 23న విడుద‌ల‌వుతోంది.