Read more!

English | Telugu

అలియా భ‌ట్‌కు చిక్కులు.. హాజ‌రవ్వాలంటూ కోర్టు ఆదేశాలు!

 

అలియా భ‌ట్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, టాప్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందిస్తోన్న 'గంగుబాయ్ క‌థియ‌వాడి' మూవీ టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లై ఫ్యాన్స్ నుంచి అమితాద‌ర‌ణ పొందింది. అయితే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజైన‌ప్ప‌ట్నుంచే ఈ సినిమా చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది. ఆ సినిమా విడుద‌ల‌ను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలంటూ గంగుబాయ్ ద‌త్త‌పుత్రునిగా చెప్పుకుంటున్న బాబూజీ షా బాంబై సివిల్ కోర్టును ఆశ్ర‌యించాడు. అయితే ఆ విజ్ఞ‌ప్తిని న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది.

లేటెస్ట్‌గా ఆ సినిమా త‌మ ఫ్యామిలీని త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో చూపిస్తోంద‌నీ, వాస్త‌వ విరుద్ధమైన అంశాల‌తో దాన్ని తీస్తున్నార‌నీ ఆరోపిస్తూ మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా హీరోయిన్ అలియా భ‌ట్‌, డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భన్సాలీ, రైట‌ర్ హుస్సేన్ జైదీల‌ను మే 21న త‌మ ముందు హాజ‌రు కావాల్సిందిగా ముంబై కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సినిమాలో వ్య‌భిచార గృహ య‌జ‌మానురాలిగా, కామాటిపుర‌కు మ‌కుటం లేని మ‌హారాణిగా అలియా క‌నిపించ‌నుంది.

కాగా.. భ‌న్సాలీ, అలియా ఇద్ద‌రూ ఈ ఆదేశాల‌పై ఎలాంటి స్పంద‌నా వ్య‌క్తం చేయ‌లేదు. బ‌యోగ్రాఫిక‌ల్ క్రైమ్ డ్రామా 'గంగుబాయ్ క‌థియ‌వాడి'ని జ‌యంతీలాల్ గ‌డాతో క‌లిసి భ‌న్సాలీ స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. 2020 సెప్టెంబ‌ర్‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ కొవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా వేశారు. ఇప్పుడు జూలై 30న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.