English | Telugu

సల్మాన్ ఖాన్, వెంకటేష్ తో రామ్ చరణ్ లుంగీ డ్యాన్స్!

ఇటీవల టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో పలు సినిమాలు రూపొంది అలరించాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తెలంగాణ నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతుండటం ఆసక్తికరంగా మారింది. సల్మాన్ ఖాన్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న హిందీ చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌'. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. రామ్ చరణ్ ఓ పాటలో చిందేయడం విశేషం. ఇటీవల 'బతుకమ్మ' పాటను విడుదల చేసిన సర్ ప్రైజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా సల్మాన్, వెంకటేష్ తో కలిసి రామ్ చరణ్ చిందేసిన 'ఏంటమ్మ' పాటను విడుదల చేసింది.

పండగ వాతావరణాన్ని తలపించేలా ఉన్న 'ఏంటమ్మ' వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. మొదట సల్మాన్ ఖాన్, వెంకటేష్ కలిసి డ్యాన్స్ తో అదరగొట్టగా.. ఇక చివరిలో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ముగ్గురూ పచ్చ చొక్కాలు, తెల్ల లుంగీలతో ఒకే రకమైన డ్రెస్ ధరించి సూపర్ స్టెప్పులతో కనువిందు చేశారు. పూజా హెగ్డే కూడా క్లాస్, మాస్ కలగలిపి పాటలో తనదైన మార్క్ చూపించింది. రామ్ చరణ్ సాంగ్ లో కనిపించింది కాసేపే అయినప్పటికీ.. తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మొత్తానికి 'బతుకమ్మ', 'ఏంటమ్మ' పాటలతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు.