Read more!

English | Telugu

వీడెవడు నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా

బాలీవుడ్ స్టార్స్ రణ్‌ బీర్‌ కపూర్‌, ఆలియా భట్ జంటగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. శనివారం హైదరాబాద్ లో రాజమౌళితో కలిసి బ్రహ్మాస్త్ర మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. తనకు అసలు అలవాటు లేని పాత్రలోకి కరణ్ జోహార్ లాక్కొచ్చారని అన్నారు.

"దాదాపు మూడేళ్ళ క్రితం కరణ్ జోహార్ ఫోన్ చేసి తాము బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నామని, ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఒకసారి మిమ్మల్ని కలుస్తారని చెప్పారు. అయాన్ తో కూర్చొని మాట్లాడుతుంటే ఒక 15-20 నిమిషాలకు నాకు అనిపించింది ఏంటంటే.. వీడెవడు నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడు అనుకున్నా. నాకు సినిమా మీద ఎంత పిచ్చి ఉంటుందో, దానికన్నా ఎక్కువ ఉంది అనిపించింది. నేను ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అవడానికి కారణం కరణ్ జోహార్ కాదు, అయాన్ కి సినిమా మీద ఉన్న ప్రేమ" అని రాజమౌళి అన్నారు.

ఈ సినిమా రషెస్ చూశానని, అద్భుతంగా తెరకెక్కించారని రాజమౌళి అన్నారు. నాగార్జున రోల్ తక్కువ సేపు ఉన్నా, చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో శివ అనే ఒక సాధారణ మనిషి సూపర్ మ్యాన్ ఎలా అయ్యాడనేది అద్భుతంగా చూపించారని చెప్పారు. అలాగే ఈ సినిమాలో రణ్‌ బీర్‌, ఆలియా భట్ మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుందని, అదే ఈ సినిమాని సోల్ అని చెప్పుకొచ్చారు. 'బ్రహ్మాస్త్ర' మొత్తం మూడు భాగాలుగా రానుందని.. ఫస్ట్ పార్ట్ తో ఫుల్ ఇంప్రెస్ అయ్యాయని, ఒక్క సజీషన్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేనంతగా అయాన్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని అన్నారు. సెకండ్, థర్డ్ పార్ట్స్ కి మాత్రం చిన్న చిన్న సజీషన్స్ ఇచ్చానని రాజమౌళి చెప్పుకొచ్చారు.