English | Telugu
'ఫ్యామిలీ మ్యాన్ 3' కి చైనాతో లింకులు..!
Updated : Aug 15, 2023
మన ఇండియన్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నవి తక్కువేనని చెప్పాలి. అలా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న మన ఓటీటీల విషయానికి వస్తే ‘ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. ఇది ఇప్పటి వరకు రెండు సీజన్స్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో సీజన్‌లో అయితే సమంత రాజీ అనే ఎల్టీటీఈ తీవ్రవాదిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ఫుల్ సిరీస్ నుంచి మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ను తెరకెక్కించిన దర్శక ద్వయం రాజ్ డీకే తాజా ఇంటర్వ్యూలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించిన క్లారిటీ ఇచ్చారు. వారు తెరకెక్కించిన గన్ అండ్ గులాబీస్ సిరీస్ ఆగస్ట్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరో వైపు వాళ్లు సమంత ప్రధాన పాత్రలో రూపొందించిన కొత్త వెబ్ సిరీస్ సిటాడెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. సిటాడెల్ సిరీస్ పూర్తి కావొస్తుందని, తర్వాత తమ ప్రాధాన్యత ‘ఫ్యామిలీ మ్యాన్ 3’పైనే ఉంటుంది. ఆ తర్వాతే ఫర్జీ 2ను తెరకెక్కిస్తామని తెలిపారు.
‘ఫ్యామిలీ మ్యాన్’లో మనోజ్ బాజ్‌పాయి ముఖ్య పాత్రధారిగా నటిస్తూ వస్తున్నారు. శ్రీకాంత్ అనే స్పై అధికారిగా ఇందులో మనోజ్ నటిస్తున్నారు. దేశానికి వచ్చే సమస్యలను తన టీమ్‌తో కలిసి మనోజ్ బాజ్‌పాయి ఎలా అడ్డుకుంటున్నారనే దాన్ని చూస్తూ వస్తున్నాం. మరోసారి మూడో సీజన్‌లోనూ ఎన్ఐఏ ఆఫీసర్‌గా ఆయనే కనిపించబోతన్నారు. చైనా వల్ల మన దేశానికి వచ్చే సమస్యను ఎన్ఐఏ ఆఫీసర్ అయిన మనోజ్ బాజ్‌పాయి ఎలా డీల్ చేశారనే కథాంశంతోనే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ను తెరకెక్కిస్తారనే టాక్ నడుస్తోంది.