Read more!

English | Telugu

స‌ల్మాన్ ఖాన్‌, సంజ‌య్ ద‌త్ గ‌డిపిన జైలులో ఊచ‌లు లెక్క‌పెడుతున్న ఆర్య‌న్ ఖాన్‌!

 

రేవ్ పార్టీ కేసులో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పిటిష‌న్‌ను శుక్ర‌వారం ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తిర‌స్క‌రించింది. అక్టోబ‌ర్ 2న ముంబై నుంచి గోవాకు వెళ్ల‌డానికి బ‌య‌ల్దేరిన క్రూయిజ్ నౌక‌పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆర్య‌న్‌తో పాటు మ‌రికొంత‌మందిని అరెస్ట్ చేసింది.

డ్ర‌గ్స్ తీసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆర్య‌న్‌, మ‌రో ఏడుగురికి 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది కోర్టు. బెయిల్ నిరాక‌ర‌ణ త‌ర్వాత వారంతా ముంబైలోరి ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఖైదీలుగా మారారు. ఆ జైలులో ఖైదు అయిన వారిలో ఆర్య‌న్ ఏమీ ఫ‌స్ట్ సెల‌బ్రిటీ కాదు. అత‌ని కంటే ముందు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు అదే జైలులో శిక్ష అనుభ‌వించారు. 

* 2002 హిట్ అండ్ ర‌న్ కేసులో స‌ల్మాన్ ఖాన్‌కు ముంబై సెష‌న్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన‌ప్పుడు, మొద‌ట ఆయ‌న్ను ఉంచింది ఆర్థ‌ర్ రోడ్ జైలులోనే.

* 1993 ముంబై సీరియ‌ల్ బాంబు పేలుళ్ల కేసులో సంబంధం ఉంద‌నే అభియోగంపై శిక్ష‌ప‌డిన సంజ‌య్ ద‌త్‌ను మొద‌ట ఆర్థ‌ర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచి, ఆ త‌ర్వాత పూణేలోని యెర‌వాడ జైలుకు త‌ర‌లించారు.

* ఇటీవ‌ల అశ్లీల చిత్రాల నిర్మాణం, ముంబైల్ యాప్స్‌లో వారి ప‌బ్లిష్ చేశార‌నే అభియోగం కింద శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి, బెయిల్ మంజూర‌య్యేంత వ‌ర‌కు రెండు నెల‌ల పాటు ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఉంచారు. 

* త‌న ఇంట్లో ప‌నిచేసే 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి, వేధింపుల‌కు గురిచేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై 2009 జూన్‌లో అరెస్ట్ అయిన గ్యాంగ్‌స్ట‌ర్ హీరో షైనీ అహుజా.. బెయిల్ ల‌భించే వ‌ర‌కూ ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఖైదీగా కాలం గ‌డిపాడు.

* 2013లో యువ న‌టి జియా ఖాన్ మృతితో సంబంధం ఉంద‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట్ అయిన సూర‌జ్ పంచోలి (సీనియ‌ర్ న‌టుడు ఆదిత్య పంచోలి కుమారుడు)ని ఆర్థ‌ర్ రోడ్ జైలులో హై సెక్యూరిటీ సెల్‌లో ఉంచారు. త‌ర్వాత అత‌ను బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు.