English | Telugu

ముంబైలో సిద్ధార్థ్‌-ర‌ష్మిక పార్టీ!

సౌత్ సెన్సేష‌న్ ర‌ష్మిక మంద‌న్న 'మిష‌న్ మ‌జ్ను' మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తోన్న ఆ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా యూనిట్ ముంబైలో పార్టీ ఇచ్చింది. బాంద్రాలోని ఓ విలాస‌వంత‌మైన రెస్టారెంట్‌లో జ‌రిగిన ఈ పార్టీకి హీరో సిద్ధార్థ్‌తో పాటు హాజ‌ర‌య్యింది ర‌ష్మిక‌. సంద‌డి సంద‌డిగా జ‌రిగిన ఈ పార్టీలో ఆ ఇద్ద‌రూ కెమెరాల‌కు పోజులిచ్చారు. ఆ ఫొటోల్లో ర‌ష్మిక చాలా హ్యాపీగా క‌నిపించింది. శంత‌ను బాగ్చీ ఈ సినిమాకి డైరెక్ట‌ర్‌.

బీజ్ క‌ల‌ర్ స్లీవ్ టాప్‌, బ్లాక్ ట్రైజ‌ర్స్‌తో ర‌ష్మిక గార్జియ‌స్ లుక్‌తో అద‌ర‌గొట్టింది. స్లీవ్ టాప్‌కు మ్యాచ్ అయ్యే చెవి రింగులు, హీల్స్ ధ‌రించింది ర‌ష్మిక‌. అలాగే, సిద్ధార్థ్ ఆలివ్ గ్రీన్ జాకెట్‌, వైట్ టీ-ష‌ర్ట్‌, డెనిమ్స్‌తో డాషింగ్‌గా క‌నిపించాడు.

కొద్ది రోజుల క్రితం ర‌ష్మిక త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా 'మిష‌న్ మ‌జ్ను' షూటింగ్ పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించింది. ఆ సినిమా షూటింగ్‌లో తాను గ‌డిపిన స‌మ‌యాన్ని 'ల‌వ్‌లీ టైమ్‌'గా అభివ‌ర్ణించింది. త‌న తొలి హిందీ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌డాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని తెలిపింది.

1970ల‌లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా 'మిష‌న్ మ‌జ్ను' రూపొందుతోంది. ఈ మూవీలో సిద్ధార్థ్ 'రా' ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడు. ర‌ష్మిక క్యారెక్ట‌ర్ ఏంట‌నేది మాత్రం వెల్ల‌డి కాలేదు.