English | Telugu

పాన్ ఇండియా మూవీలో 'సీత'గా కంగనా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ 'తలైవి'. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కంగనా టైటిల్ రోల్ పోషించింది. ఇటీవల విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. జయలలితగా కంగనా నటన ప్రశంసలు అందుకుంది. కాగా కంగనా తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది.

కంగనా తన తదుపరి చిత్రాన్ని సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించింది. 'సీత: ది ఇన్‌కార్నేషన్‌' అనే సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్లు తెలిపింది. 'ఇలాంటి టాలెంటెడ్‌ టీంతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జై సీతారామ్‌' అని కంగనా పోస్ట్ చేసింది.

ఎస్.ఎస్. స్టూడియోస్ బ్యానర్ పై సలోని శర్మ నిర్మాతగా అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో 'సీత: ది ఇన్‌కార్నేషన్‌' సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇటీవల కంగనా నటించిన 'తలైవి'కి సైతం ఆయనే కథ అందించడం విశేషం.

భావితరాలకు సీత చరిత్రను అందచేయడమే లక్ష్యంగా తానీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాత సలోని శర్మ తెలిపారు. సీత పాత్ర చేయడానికి కంగనా ఒప్పుకోవడం ఆనందనిచ్చిందని దర్శకుడు అలౌకిక్ అన్నారు. ఈ మూవీ మనం పురాణాలను చూసే విధానాన్ని మార్చుతుందని అలౌకిక్‌ చెప్పారు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.