English | Telugu
అమితాబ్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డ్ అందించనున్న హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్!
Updated : Mar 10, 2021
ఇండియన్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌ను హాలీవుడ్‌కు చెందిన ప్రపంచప్రఖ్యాత దర్శకులు మార్టిన్ స్కోర్సీస్, క్రిస్టఫర్ నోలన్ ప్రతిష్ఠాత్మక '2021 ఎఫ్ఐఏఎఫ్ అవార్డ్'తో సత్కరించనున్నారు. ఈ అవార్డును ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్ఐఏఎఫ్) నెలకొల్పింది. మార్చి 19న ఆన్‌లైన్ ద్వారా జరిగే వేడుకలో ఈ పురస్కారాన్ని అమితాబ్ అందుకోనున్నారు.
ఈ అవార్డుకు అమితాబ్ పేరును 'ఎఫ్ఐఏఎఫ్'కు అనుబంధంగా ఉన్న 'ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్' స్థాపకుడు, సినీ నిర్మాత శివేంద్ర సింగ్ దుంగార్పూర్ నామినేట్ చేశారు. ప్రపంచ సినిమా సినిమా వారసత్వ సంరక్షణకు బిగ్ బి చేసిన కృషికీ, సినిమాపై అంకితభావానికీ గుర్తింపుగా ఈ అవార్డ్‌ను ఆయనకు అందజేస్తున్నారు. గతంలో ఈ పురస్కారాన్ని మార్టిన్ స్కోర్సీస్ (2001), ఇంగ్మర్ బెర్గ్‌మన్ (2003), క్రిస్టఫర్ నోలన్ (2017) లాంటివారు అందుకున్నారు.
ఈ అవార్డును అందుకోనుండటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అమితాబ్ అన్నారు. మన సినిమాలను కాపాడుకోవడానికి, సినిమా పరిరక్షణ కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రపంచానికి మన వంతు భాగస్వామ్యం అందించేందుకు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పనిచేస్తూ వస్తున్నానని ఆయన తెలిపారు.
"సినిమాని పరిరక్షించుకోవడం ప్రపంచ సమస్య. భారతీయ సినిమా వారసత్వాన్ని కాపాడేందుకు అమితాబ్ బచ్చన్ చేస్తున్న కృషి అసామాన్యం. ఐదు దశాబ్దాల కెరీర్‌తో ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ నటుడికి మించి ఈ ఏడాది గౌరవించుకోవడానికి మరొకరు కనిపించలేదు." అన్నారు మార్టిన్ స్కోర్సీస్.