English | Telugu

‘ఆపరేషన్‌ సిందూర్‌’ మూవీ పోస్టర్‌ విడుదల.. డైరెక్టర్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు!

పహల్గామ్‌ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం.. ప్రతీకార చర్య మొదలుపెట్టి టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో వారి స్థావరాలు నేలమట్టం కావడమే కాకుండా ఎంతో మంది టెర్రరిస్టులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్‌ ఘటన తర్వాత భారతీయుల్లో రగిలిన ప్రతీకార జ్వాల ఈ దాడితో కాస్త చల్లారింది. ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌ కూడా ప్రతి దాడికి ప్రయత్నిస్తూ విఫలమవుతోంది. ఇదిలా ఉంటే.. ఆపరేషన్‌ సిందూర్‌ అనే టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరు వినగానే ఆ టైటిల్‌తో సినిమా చేసేందుకు మేకర్స్‌ పోటీ పడ్డారు. ఆ క్రమంలోనే ఒక ప్రొడక్షన్‌ సంస్థ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటన కూడా చేసేసింది. అంతేకాదు, దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్‌.

ఆపరేషన్‌ సిందూర్‌ పోస్టర్‌ను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆ సినిమా డైరెక్టర్‌ ఉత్తమ్‌ మహేశ్వరిపై విరుచుకుపడ్డారు. ఈ పోస్టర్‌లో టైటిల్‌కి పైన ‘భారత్‌ మాతా కీ జై’ అని ఉంది. టైటిల్‌ కింద ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ఒక మహిళ ఒక చేతిలో గన్‌ పట్టుకుని, మరో చేతితో నుదుటన సిందూరం పెట్టుకుంటున్న ఫోటో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో బాంబు దాడుల సీన్‌ కనిపించింది. ‘ఇండియా చేసిన ధైర్య సాహసాలతో కూడిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సినిమాకి నిర్మాతలుగా నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్‌, ది కంటెంట్‌ ఇంజనీర్‌ పేర్లు, దర్శకులుగా ఉత్తమ్‌, నితిన్‌ పేర్లు ఉన్నాయి.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ సినిమా ప్రకటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం యుద్ధ వాతావరణంలో ఉండగా ఇలాంటి సినిమాను ఎనౌన్స్‌ చేయడం చాలా దారుణమని విమర్శిస్తున్నారు. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది.. ఈ సమయంలో ఇలాంటి పోస్టర్‌ రిలీజ్‌ చెయ్యడానికి సిగ్గు లేదా అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. సినిమా ద్వారా డబ్బు సంపాదించడానికి, జరుగుతున్న పరిణామాలను క్యాష్‌ చేసుకోవడానికి ఇదో టెక్నిక్‌ అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఘటన జరిగినపుడు ఎవరూ ముందుకు వచ్చి మాట్లాడలేదుగానీ ఇప్పుడు సినిమా తీసేందుకు మాత్రం సిద్ధమైపోయారు అంటూ విమర్శిస్తున్నారు. భయం గుప్పిట్లో మేం బ్రతుకుతున్నాం. మాకు, మా పిల్లలకు ఎలాంటి హాని జరగకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు చేయకండి అని యుద్ధ ప్రభావం ఉన్న ప్రాంతాల నెటిజన్లు అని కామెంట్‌ చేస్తున్నారు.