English | Telugu

నాని న‌ట‌న చూసి నాకు దుఃఖం ఆగ‌లేదు!

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా న‌టించిన జెర్సీ (2019) మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, న‌టునిగా నానికి చాలా పేరు తెచ్చింది. ఇటు ప్రేక్ష‌కుల నుంచి అటు విమ‌ర్శ‌కుల దాకా స‌ర్వ‌త్రా అత‌నికి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఆ సినిమాని చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ క‌పూర్.. దానిని హిందీ రీమేక్‌లో న‌టించేందుకు ముందుకు వ‌చ్చాడు. ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ ఆ సినిమానీ రూపొందిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్త‌యింది. తెలుగులో స‌త్య‌రాజ్ చేసిన క్రికెట్ కోచ్ మూర్తి క్యారెక్ట‌ర్‌ను రీమేక్‌లో షాహిద్ తండ్రి పంక‌జ్ క‌పూర్ చేస్తుండ‌టం విశేషం.

కాగా, 'జెర్సీ' స్టోరీ త‌న‌కు బాగా క‌నెక్ట‌య్యింద‌ని షాహిద్ చెప్పాడు. 'అర్జున్‌రెడ్డి' రీమేక్ 'క‌బీర్ సింగ్‌'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న షాహిద్‌.. ఆ సినిమా త‌ర్వాత ఏం చేయాల‌నే మీమాంస‌లో ఉన్న త‌న‌కు 'జెర్సీ' చూశాక‌, రిలీఫ్ అనిపించింద‌ని తెలిపాడు. క్రికెట‌ర్‌గా రిటైర్ అయ్యాక స‌క్సెస్ అయిన ఓ వ్య‌క్తి క‌థ త‌న హృద‌యానికి బాగా ద‌గ్గ‌ర‌య్యింద‌నీ, త‌ను కూడా ఆల‌స్యంగా స‌క్సెస్ సాధించిన‌వాడినేన‌ని చెప్పాడు. ఆల‌స్యంగా స‌క్సెస్ వ‌స్తే ఎలా ఉంటుందో త‌ను అనుభ‌వించాను కాబ‌ట్టి, 'జెర్సీ' క‌థ బాగా న‌చ్చింద‌న్నాడు.

ఒరిజిన‌ల్ 'జెర్సీ'లో క‌థానాయ‌కుడు అర్జున్‌గా నాని చాలా గొప్ప‌గా చేశాడ‌నీ, కొన్ని సీన్ల‌లో అత‌ని ప‌ర్ఫార్మెన్స్ చూసి త‌న‌కు దుఃఖం ఆగ‌లేద‌నీ షాహిద్ తెలిపాడు. ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నాన‌న్నాడు. కాగా తెలుగులో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ చేసిన నాని భార్య పాత్ర‌ను హిందీలో మ‌రాఠీ తార మృణాల్ ఠాకూర్ పోషిస్తోంది. ఒరిజిన‌ల్‌లో హీరో హీరోయిన్ల‌కు పెట్టిన పేర్ల‌నే హిందీలోనూ కొన‌సాగిస్తున్నారు. కాక‌పోతే రాయిచంద్ అనే పేరును జోడించారు. అంటే అర్జున్ రాయిచంద్‌గా షాహిద్‌, సారా రాయిచంద్‌గా మృణాల్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ క‌పుల్ స‌చేత్‌-ప‌రంప‌ర సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాతో గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట‌ర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు.