English | Telugu
టైమ్ ట్రావెల్ కథాంశంతో `క్రిష్ 4`
Updated : Jun 26, 2021
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ని సూపర్ హీరోగా ప్రెజెంట్ చేసిన చిత్రం `క్రిష్` (2006). బ్లాక్ బస్టర్ మూవీ `కోయీ మిల్ గయా` (2003)కి సీక్వెల్ గా రూపొందిన `క్రిష్`.. అంతకుమించి ఆదరణ పొందింది. అలాగే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో చిత్రం `క్రిష్ 3` (2013) కూడా నెగటివ్ టాక్ ని తట్టుకుని మరీ వసూళ్ళ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం ఈ సిరీస్ లో నాలుగో సినిమా రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని.. `క్రిష్` సిరీస్ లో గత మూడు సినిమాలను తీర్చిదిద్దిన అగ్ర దర్శకుడు, హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ నే తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. `క్రిష్ 4`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సీక్వెల్ రూపొందనుందట. అంతేకాదు.. `కోయీ మిల్ గయా`, `క్రిష్` రెండింటిని ఒకే చోట చేర్చే కథ ఇదని బాలీవుడ్ బజ్. దీనికి తోడు, కొద్ది రోజుల క్రితం `క్రిష్` 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ``గతం అయిపోయింది. భవిష్యత్ ఏం తీసుకువస్తుందో చూద్దాం`` అంటూ హృతిక్ చేసిన ట్వీట్ కూడా ఈ కథనాలకు బలం చేకూర్చుతోంది. మరి.. టైమ్ ట్రావెల్ కథాంశంతో `క్రిష్ 4` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.