English | Telugu

పండంటి కొడుకుకు జ‌న్మ‌నిచ్చిన దియా మీర్జా.. అప్పుడే పేరు కూడా పెట్టేశారు!

బాలీవుడ్ న‌టి దియా మీర్జా బుధ‌వారం పండంటి కొడుకుకు జ‌న్మ‌నిచ్చారు. ఆ చిన్నారి చేతిని ప‌ట్టుకున్న ఫొటోను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె, అత‌నికి 'అవ్యాన్' అనే పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. బిజినెస్‌మ్యాన్ వైభ‌వ్ రేఖితో ముంబైలో ఆమె వివాహం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15న జ‌రిగింది. ఇరువురికీ అది రెండో వివాహ‌మే. ఏప్రిల్ 1న తాను గ‌ర్భ‌వ‌తిన‌నే విష‌యం ఆమె రివీల్ చేశారు. అంటే వైభ‌వ్‌తో వివాహానికి ముందే ఆమె గ‌ర్భం దాల్చిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసిన సుదీర్ఘ‌మైన నోట్‌లో, "సంతానం పొంద‌డం అంటే మీ శ‌రీరం వెలుప‌ల మీ హృద‌యం తిరుగుతూ ఉండాల‌ని డిసైడ్ చేసుకోవ‌డ‌మే." అనే ఎలిజిబెత్ స్టోన్ కొటేష‌న్‌ను ఆమె ఉటంకించారు. "ఈ మాట‌లు వైభ‌వ్‌తో పాటు నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయ‌నేదాన్ని చ‌క్క‌గా చెప్తాయి. మా హృద‌య‌స్పంద‌న‌, మా కుమారుడు అవ్యాన్ అజాద్ రేఖి మే 14న పుట్టాడు. ఇవాళ తెల్ల‌వారేస‌రికి లిటిల్ మిర‌కిల్ ఎంట‌ర్ అవ‌డంతో నియోనాట‌ల్ ఐజీయూలో నిర్విరామంగా అల‌సిపోకుండా న‌ర్సులు, డాక్ట‌ర్లు శ్ర‌ద్ధ‌గా చూసుకుంటూ వ‌స్తున్నారు." అని ఆమె రాసుకొచ్చారు.

"నా గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఆక‌స్మికంగా అపెండెక్ట‌మీతో పాటు తీవ్ర‌మైన బాక్లీరియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌య్యాను. అది ప్రాణాంత‌కంగా మారింది. అదృష్ట‌వ‌శాత్తూ, స‌కాలంలో వైద్యం అంద‌డం, మా డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎమ‌ర్జెన్సీ సి-సెక్ష‌న్ ద్వారా సుర‌క్షితంగా మా బాబు పుట్టాడు." అని ఆమె వెల్ల‌డించారు.

ఇటీవ‌ల విడుద‌లైన 'వైల్డ్ డాగ్' మూవీలో నాగార్జున భార్య‌గా దియా క‌నిపించారు.