Read more!

English | Telugu

హీరోయిన్ పెళ్లికి మంత్రాలు చ‌దివిన మ‌హిళ‌!

 

బాలీవుడ్ తార‌, నాగార్జున జోడీగా 'వైల్డ్ డాగ్‌'లో న‌టించిన దియా మీర్జా ఈ నెల 15న ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త వైభ‌వ్ రేఖిని పెళ్లాడారు. ఈ వేడుక‌కు కుటుంబస‌భ్యులు, కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. పెళ్లి వేడుక‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. సాధార‌ణంగా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం మంత్రాలు చ‌దువుతూ పెళ్లి జ‌రిపించేది పురోహితుడు. కానీ దియా పెళ్లిని జ‌రిపించిందీ, మంత్రాలు చ‌దివిందీ ఒక వృద్ధ మ‌హిళ! అంతే కాదు, ఈ పెళ్లిలో క‌న్యాదానం లాంటి సంప్ర‌దాయాన్ని కూడా ప‌క్క‌న పెట్టేశామ‌ని దియా వెల్ల‌డించింది.

పెళ్లికి సంబంధించిన ఓ అంద‌మైన పిక్చ‌ర్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది దియా. హంగూ ఆర్భాటాలు లేకుండా త‌క్కువ అలంక‌ర‌ణ‌ల‌తో, ప‌ర్యావ‌ర‌ణాన్ని పాడుచేయ‌ని రీతిలో ఈ వివాహం చేసుకున్నామ‌ని ఆ ఫొటోకు పెట్టిన సుదీర్ఘ‌మైన కాప్ష‌న్‌లో రాసుకొచ్చింది. గ‌త 19 సంవ‌త్స‌రాలుగా ప్ర‌తి ఉద‌యం తాను గ‌డుపుతూ వ‌చ్చిన తోట‌లో పెళ్లి జ‌రిగింద‌ని తెలిపింది. ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువులు వాడ‌కుండా, ఎలాంటి వ్య‌ర్థాలు లేకుండా పెళ్లి చేసుకున్నందుకు గ‌ర్విస్తున్నాన‌ని దియా చెప్పింది.

"మాకు సంబంధించిన పెద్ద విష‌యం వేద‌మంత్రాలు చ‌దువుతూ పెళ్లితంతును నిర్వ‌హించింది ఓ పురోహితురాలు! కొన్నేళ్ల క్రితం నా బాల్య స్నేహితురాలు అన‌న్య పెళ్లిలో తొలిసారిగా పురోహితుడి బ‌దులు పురోహితురాలు మంత్రాలు చ‌దువుతూ, పెళ్లి జ‌రిపించ‌డం చూశాను. మా పెళ్లికి అన‌న్య ఇచ్చిన కానుక షీలా అత్త‌ను తీసుకురావ‌డం. ఆమె అనన్యకు అత్త‌, ఓ పురోహితురాలు. మా కోసం త‌ను పౌరోహిత్యం వ‌హించి, మా పెళ్లి జ‌రిపించారు. షీలా అత్తకు తోడుగా అన‌న్య కూడా అక్క‌డే ఉండి, ఆమె చ‌దివే మంత్రాల‌కు అర్థాలు చెబుతూ వ‌చ్చింది. మా పెళ్లిని ఇలా జ‌రుపుకోవ‌డం గౌర‌వంగా, ఆనందంగా అనిపించింది." అని రాసింది దియా.