English | Telugu
91 ఏళ్ల వయసులోనూ పరుగు ఆపని లెజెండ్! ఏఎన్నార్ రికార్డును దాటేశాడు!!
Updated : Jun 1, 2021
అక్కినేని నాగేశ్వరరావు మరణించేంత వరకూ నటిస్తూనే ఉన్నారు. చనిపోయేనాటికి ఆయన వయసు 90 సంవత్సరాలు. అయితే ఆ రికార్డును హాలీవుడ్ లెజెండ్ క్లింట్ ఈస్ట్‌వుడ్ బద్దలు కొట్టేశారు. ఆయనకు పరుగు ఆపడం, ఆగిపోవడం అన్నది తెలీదు. మే 31న ఆయన 91వ బర్త్‌డే జరుపుకున్నారు. ఆ వయసులో ఎవరూ ఉండనంత చురుకుగా, వేగంగా ఆయన పని చేసుకుపోతూనే ఉన్నారు. క్వాలిటీ విషయంలోనూ ఆయన ఏమాత్రం రాజీ పడట్లేదు. ఆయన చేస్తున్న ప్రతి కొత్త సినిమా ఒక ఫ్రెష్ మాస్టర్‌పీస్‌లా పేరు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ ఆశించడంతో తప్పులేదు. 21వ శతాబ్దంలో ఆయన నుంచి 17 సినిమాలు వస్తే, వాటిలో 'మిస్టిక్ రివర్', 'మిలియన్ డాలర్ బేబీ', 'లెటర్స్ ఫ్రమ్ ఇవో జిమా', 'అమెరికన్ స్నైపర్' లాంటి జెమ్స్ ఉన్నాయి. ఆ నాలుగింటికీ ఆయన దర్శకుడు-నిర్మాత కావడం గమనార్హం.
ఇప్పటికి ఐదు దశాబ్దాల క్రితం 'ప్లే మిస్టీ ఫర్ మి' మూవీతో ఆయన నటుడి నుంచి డైరెక్టర్‌గా అవతారం ఎత్తారు. కానీ మార్లన్ బ్రాండో, స్టీవెన్ సీగల్ తరహాలోనే నటులు దర్శకులు కాలేరంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.
కానీ, చాలా త్వరగానే విమర్శకులు తమ మాటను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ప్రపంచం ఆయనను యాక్టర్‌ను మించిన డైరెక్టర్‌గా గుర్తించింది. ఇప్పటిదాకా ఈస్ట్‌వుడ్ 39 సినిమాలు తీశారు. 'క్రై మాచో' మూవీతో త్వరలో మనముందుకు రాబోతున్నారు. ఇందులో ఆయన తెరమీద కూడా కనిపించనున్నారు. ఫ్రెంచ్ అయితే ఆయనను హాలీవుడ్ కంటే ఎక్కువగా గౌరవించింది. ఆయన రూపొందించిన ఐదు సినిమాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీపడ్డాయి. వాటిలో 'వైట్ హంగర్ బ్లాక్ హార్ట్' మూవీకి నీరాజనాలు అందాయి. ఆ సినిమాలో ఆయన జాన్ హూస్టన్‌కు కల్పిత పాత్రను పోషించారు.
మనకు క్లింట్ ఈస్ట్‌వుడ్ అనగానే హాలీవుడ్ కౌబాయ్ ఫిలిమ్సే గుర్తుకువస్తాయి. ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్ (1964), ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్ (1965), ద గుడ్ ద బ్యాడ్ అండ్ ద అగ్లీ (1966), హ్యాంగ్ దెమ్ హై (1968), ది ఔట్‌లా జోసీ వేల్స్ (1976), పేల్ రైడర్ (1985), అన్‌ఫర్‌గివెన్ (1992) లాంటి సినిమాలతో కౌబాయ్ సినిమాల హీరోగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆయన సంపాదించుకున్నారు.