Read more!

English | Telugu

జైల్లోని కొడుకు క్యాంటీన్ ఖ‌ర్చుల కోసం రూ. 4500 పంపిన షారుక్ ఖాన్‌!

 

అక్టోబ‌ర్ 2న డ్ర‌గ్ సంబంధింత కేసులో అరెస్ట‌యిన షారుక్ ఖాన్‌-గౌరీ ఖాన్ దంప‌తుల కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ప్ర‌స్తుతం ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఖైదీగా కాలం గ‌డుపుతున్నాడు. శుక్ర‌వారం త‌న పేరెంట్స్‌తో అను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన‌ట్లు జైలు అధికారులు తెలిపారు.

కొవిడ్ 19ను దృష్టిలో ఉంచుకొని జైలులో ఉన్న నిందితులు, ఖైదీలు వారానికి రెండు సార్లు వీడియో కాల్ ద్వారా త‌మ కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడ‌వ‌చ్చున‌నేది హైకోర్టు ఆర్డ‌ర్. త‌న పేరెంట్స్‌తో ఆర్యన్ 10 నిమిషాలు మాట్లాడాడు. అంత‌సేపూ అత‌నితో ఒక జైలు అధికారి ఉన్నాడు. 

కాగా అక్టోబ‌ర్ 11న ఆర్య‌న్‌కు జైలు క్యాంటీన్ ఖ‌ర్చుల నిమిత్తం తండ్రి షారుక్ ద్వారా రూ. 4,500 మ‌నీ ఆర్డ‌ర్ రూపంలో అందన‌ట్లు జైలు అధికారులు ధ్రువీక‌రించారు. జైలు రూల్స్ ప్ర‌కారం ఒక ఖైదీ జైల్లో త‌మ ఖ‌ర్చుల నిమిత్తం మాగ్జిమ‌మ్ రూ. 4,500 వ‌ర‌కు మ‌నీ ఆర్డ‌ర్‌ను అందుకోవ‌చ్చు.

ఆర్థ‌ర్ రోడ్ జైలులో మొత్తం 3,200 మంది ఖైదీలు ఉన్నారు. మ‌హ‌మ్మారి కార‌ణంగా బ‌య‌టి వ్య‌క్తులెవ‌రూ జైల్లో ఉన్న‌వారిని క‌లుసుకోవ‌డానికి వీల్లేకుండా నిబంధ‌న‌లు విధించారు. కేవ‌ల్ ఫోన్ ద్వారా మాత్ర‌మే త‌మ‌కు కావాల్సిన వారితో ఖైదీలు మాట్లాడుకోవ‌చ్చు. ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో అత్య‌ధికంగా 10 నిమిషాల సేపు వారు మాట్లాడ‌వ‌చ్చు. 

డ్ర‌గ్ రైడ్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసిన ఆర్య‌న్‌తో పాటు మ‌రో ఐదుగురు నిందితుల‌ను కొవిడ్ 19 ప‌రీక్ష‌ల త‌ర్వాత నెగ‌టివ్ రావ‌డంతో వారిని ఆర్థ‌ర్ రోడ్ జైలులోని కామ‌న్ సెల్‌కు త‌ర‌లించారు. అదివ‌ర‌కు వారంతా ఆ జైలులోనే క్వారంటైన్ బార‌క్‌లో ఉన్నారు.