English | Telugu

"ఇక త‌ప్పుడు ప‌నులు చేయ‌ను.. దేశానికి సేవ చేస్తా".. ఆర్య‌న్ ఖాన్ ప్రామిస్‌!

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కౌన్సిలింగ్ చేసిన సంద‌ర్భంగా "మంచి పౌరుడిగా ఉండి దేశానికి సేవ‌చేస్తాను" అని షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ చెప్పాడు. 23 సంవ‌త్స‌రాల ఆర్య‌న్‌ డ్ర‌గ్ కేసులో ప‌ట్టుబ‌డి నిందితునిగా అక్టోబ‌ర్ 8 నుంచి ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో కాలం గ‌డుపుతున్నాడు.అక్టోబ‌ర్ 2న ముంబై నుంచి గోవాకు వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జ‌రుగుతుండ‌గా ఎన్సీబీ రైడ్ చేసి ఆర్య‌న్‌, మ‌రో ఏడుగురిని అరెస్ట్ చేసింది.

ఆర్థ‌ర్ రోడ్ జైలుకు వెళ్ల‌క ముందు త‌మ‌ క‌స్ట‌డీలో ఉన్న ఆర్య‌న్‌కు ఎన్సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే కౌన్సిలింగ్ నిర్వ‌హించారు. వాస్త‌వానికి ఆ డ్ర‌గ్ కేస్ ఇన్వెస్టిగేష‌న్ జ‌రుగుతోంది ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే. అంద‌రినీ గ‌ర్వ‌ప‌డేలా చేస్తాన‌ని కౌన్సిలింగ్ సంద‌ర్భంగా చెప్పిన ఆర్య‌న్‌, ఇక నుంచీ త‌ప్పుడు ప‌నులు చేయ‌న‌నీ, పేద‌ల‌కు, ఆక‌లితో ఉన్న‌వారికీ సాయం చేస్తాన‌ని చెప్పాడంట‌.

ఆర్య‌న్ ఖాన్ గురించి ప్ర‌శ్నించిన‌ప్పుడు, "అరెస్ట్ చేసిన ప్ర‌తి ఒక్క నిందితునికీ క‌స్ట‌డీ సంద‌ర్భంగా రెండు మూడు గంట‌ల సేపు కౌన్సిలింగ్ నిర్వ‌హిస్తాం" అని మీడియాకు చెప్పారు స‌మీర్ వాంఖ‌డే. డ్ర‌గ్స్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వివిధ మ‌త‌గురువుల‌తో, సామాజిక కార్య‌క‌ర్త‌ల‌తో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. "నిందితుల‌కు వారి మ‌త విశ్వాసాల‌కు అనుగుణంగా భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్‌, బైబిల్‌ల‌ను అంద‌జేస్తాం" అని ఆయ‌న తెలిపారు.