Read more!

English | Telugu

య‌స్సీ/య‌స్టీ చ‌ట్టం కింద అరెస్ట‌యిన హీరోయిన్‌!

 

బాలీవుడ్ తార‌, ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన యువికా చౌధ‌రిని షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ (ప్రివెన్ష‌న్ ఆఫ్ ఎట్రాసిటీస్‌) యాక్ట్‌, 1989 (య‌స్సీ/య‌స్టీ యాక్ట్‌) కింద హ‌ర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆమె కుల‌ప‌ర‌మైన నింద‌ను ఉప‌యోగించ‌డం దీనికి కార‌ణం. అక్టోబ‌ర్ 18న హ‌ర్యానా పోలీసులు అరెస్ట్ చేయ‌గా, మ‌ధ్యంత‌ర బెయిల‌పై ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చింది. పోలీస్ స్టేష‌న్ బ‌య‌ట‌వున్న ఆమె ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి.

"హైకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్ర‌కారం నా క్ల‌యింట్ ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రిస్తున్నారు. ఇప్పుడామె మ‌ధ్యంత‌ర బెయిల్ పొందారు." అని ఆమె లీగ‌ల్ రిప్ర‌జెంటేటివ్ అశోక్ బిష్ణోయ్ తెలిపారు.

వీడియోలో చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో యువిక చాలా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది. దాంతో ఆమె త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు తెలిపింది. "హాయ్ గైస్‌.. నా మునుప‌టి వ్లాగ్‌లో నేను ఉప‌యోగించిన పదానికి అర్థం నాకు తెలీదు. ఎవ‌రినీ బాధ‌పెట్ట‌డం నా ఉద్దేశం కాదు, ఎవ‌రినో బాధ‌పెట్టాల‌ని నేనెప్పుడూ అనుకోను. ప్ర‌తి ఒక్క‌రికీ నేను క్ష‌మాప‌ణ‌లు తెలుపుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తాను. ల‌వ్ యు ఆల్." అని ఆమె రాసుకొచ్చింది.

ర‌జ‌త్ క‌ల్స‌న్ అనే ద‌ళిత హ‌క్కుల కార్య‌క‌ర్త ఆమెపై ఫిర్యాదు చేయ‌డంతో, హ‌ర్యానా పోలీసులు యువికా చౌధ‌రిపై కేసు న‌మోదు చేశారు. వీడియోలో ఆమె ఒక కులాన్ని కించ‌ప‌రిచే, అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారని త‌న ఫిర్యాదులో ర‌జ‌త్ ఆరోపించారు.